వైకాపా అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని, చివరికి దివ్యాంగుల పట్ల కూడా వివక్ష చూపిస్తోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘జగన్‌రెడ్డికి చేతనైతే రూ.3000 ఉన్న దివ్యాంగుల పింఛన్ రూ.5000 చేయాలి. నేను స్కూటర్లు ఇచ్చా.. చేతనైతే కార్లు ఇవ్వు. పెళ్లి కానుకగా లక్ష ఇచ్చా.. చేతనైతే రూ.2లక్షలివ్వు. అంతేగానీ పథకాల్లో కోతలు కోస్తాం... వేధిస్తాం అంటే ఊరుకునేది లేదు. ఓటీఎస్ పేరుతో పెన్షన్లు రద్దు చేస్తున్నారు. బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ.. చివరికి కాల్‌మనీ వ్యాపారానికి తెరలేపారు. నా ఇంటికి రిజిస్ట్రేషన్ పేరుతో నువ్వు డబ్బులు వసూలు చేయడం ఏంటి?’ అని చంద్రబాబు నిలదీశారు.
ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది
‘నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా విజన్ 2029 ప్రకటిస్తే జగన్‌రెడ్డి దాన్ని నాశనం చేశారు. నవరత్నాల పేరుతో నవమోసాలకు తెగబడ్డారు. మోసపోయిన ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఈ దివ్యాంగ దినోత్సవం రోజున సమరశంఖం పూరిస్తున్నాం. ఈ వేదిక నుండి జగన్‌రెడ్డిని హెచ్చరిస్తున్నా... రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే. వచ్చిన వెంటనే కమిషన్ వేసి తప్పు చేసిన ఏ అధికారినీ వదలను...’ అని చంద్రబాబు పేర్కొన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక చట్టసభల్లోకి దివ్యాంగులను తీసుకెళతానని హామీ ఇస్తున్నానన్నారు. ‘తెదేపా దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా సునీల్‌కుమార్, గౌరవ అధ్యక్షులుగా గోనుగుండ్ల కోటేశ్వరరావును నియమిస్తున్నా. మరో పది రోజుల్లో పార్లమెంట్ నియోజకవర్గం నుండి.. గ్రామస్థాయి వరకు అన్ని కమిటీలను ప్రకటిస్తాం’ అని చెప్పారు. రెండుసార్లు ఐఏఎస్ క్వాలిఫై అయ్యి కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి అకాడమీ ఏర్పాటు చేసిన మల్లవరపు బాలలతను ఆయన సత్కరించారు. బాలలత మాట్లాడుతూ తాను రెండుసార్లు సివిల్స్ సాధించడానికి చంద్రబాబే ఆదర్శమన్నారు.
పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
రాజ్యాంగ సవరణతో పంచాయతీలకు కల్పించిన ప్రత్యేక అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని చంద్రబాబు విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులు శుక్రవారం ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు.
* బీసీ కుల గణన జరిగినప్పుడే సంక్షేమ ఫలాలు సమర్థంగా వారికి అందుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. బీసీ కులగణన కూడా చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావుతో పాటు పలువురు ప్రతినిధులు ఆయనకు శుక్రవారం వినతిపత్రం అందించారు.
ఇదీ చదవండి..