గుంటూరు జిల్లా కేంద్రంలో పట్టపగలు నడిరోడ్డుపై అత్యంత దారుణంగా రమ్య అనే బీటెక్ విద్యార్థిని హత్య తనను తీవ్రంగా కలిచివేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా బయటకు రాగలిగినప్పుడు అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లని గాంధీ మహాత్ముడు ఆనాడే అన్నారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం అరాచకపాలనలో పట్టపగలు ఆడపిల్ల సొంత ఇంట్లోనైనా భద్రంగా ఉండగలిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లంటూ మహిళాలోకం భయం భయంగా బతుకుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: Murder: గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచిన దుండగుడు
'దాడులు నిత్యకృత్యమయ్యాయి..'
స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్న రోజునే గుంటూరు జిల్లా నడిరోడ్డు మీద బీటెక్ విద్యార్థిని రమ్యని అత్యంత కిరాతకంగా హతమార్చడం వైకాపా ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలోనే ఘటన జరిగిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమౌతోందని చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యమైపోయాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
'రెండేళ్లలో 500 పైగా ఘటనలు'
శాంతి భధ్రతలు సమర్ధవంతంగా నిర్వహించినప్పుడే రాష్ట్రం సమగ్రాభివృద్ది చెందుతుందని, జగన్ పాలనలో అరాచకం వికృతరూపం దాల్చడంతో పరిస్థితులన్నీ అధ్వానంగా మారాయని అన్నారు. గడిచిన రెండేళ్లలో మహిళలపై 500పైగా దాడులు, అత్యాచార ఘటనలు జరిగాయని, నేటికీ చాలా కేసుల్లో నిందితులని పట్టుకోలేకపోవడం ప్రభుత్వం చేతకానితనమా లేక నిందితులకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తున్నట్టా.. అనే అనుమానాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
'షోడో హోం మంత్రి చేతిలోనే అంతా..'
ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోని సీతానగరంలో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగితే నేటికీ నిందితుడిని పట్టుకోలేకపోవడానికి కారణమేంటని చంద్రబాబు నిలదీశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మని అత్యాచారం చేసి చంపితే నేటికీ ఆ కేసులో పురోగతి లేకపోవడం విచారకరమన్నారు. ఎస్సీ మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఎస్సీ మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా స్పందించకపోవడానికి.. ఆమె షాడో హోంమంత్రి చేతిలో కీలుబొమ్మగా మారడమే కారణమని ఆరోపించారు.
'సీఎం ఇంటి పక్కవారికే రక్షణ కరవు..'
ముఖ్యమంత్రి ఇంటి పక్కనే నివాసం ఉంటున్న ఎస్సీ మహిళల మానప్రాణాలకు రక్షణలేదని.. సీఎం సొంత నియోజకవర్గంలో దళిత మహిళపై అత్యాచారాలకు అడ్డుకట్ట పడటంలేదని మండిపడ్డారు. ఏకంగా సీఎం చెల్లెలు సునీతారెడ్డి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిందంటే.. ఇక సామాన్యులకు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేమి భద్రత దొరకుతుందని ప్రశ్నించారు. మహిళలకు భద్రత కల్పించడం అంటే.. ప్రచారం కోసం కోట్లు ఖర్చుపెట్టి సొంత పేపరుకు ఫేక్ ప్రకటనలు ఇవ్వడం, దిశలాంటి చట్టాలు, ఖాళీ జీవోలివ్వడం కాదని ఎద్దేవా చేశారు. రమ్యని అత్యంత దారుణంగా చంపిన హంతకుడ్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని.. రాష్ట్రంలో మరో మహిళకు అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
Home minister Sucharitha : 'బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం'