తిరుపతి ఉపఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటుతిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలను జతచేస్తూ 22 పేజీల లేఖ రాశారు. ఈనెల 17 న పోలింగ్ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా అప్రజాస్వామికంగా ఓటింగ్ జరిగిందని,ఎప్పటికప్పుడు పరిణామాలను ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చినా... చర్యలు శూన్యమని లేఖలో పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు వైకాపాకు కొమ్ముకాశారన్నారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో అత్యల్ప ఓటింగ్ జరగటం అక్కడి అక్రమాలను బహిర్గతం చేస్తోందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడ్డారని లేఖలో తెలిపారు. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడిన ఆడియో టేపుతోపాటు. వైకాపా నేతలు, దొంగ ఓటర్లకు సంబంధించిన ఆడియో, వీడియోలను చంద్రబాబు తన లేఖకు జత చేశారు.
దొంగఓట్లు వేసేందుకు వచ్చిన వారిని తెలుగుదేశం నేతలు పట్టుకుని అప్పగించినా అధికారులకు పట్టించుకోలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న 250 వాహనాల్ని తిప్పి పంపామని డీజీపీనే స్వయంగా ప్రకటించడం పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు వేయడానికి వచ్చారనడానికి నిదర్శనమన్నారు. ఆ 250 బస్సుల్ని పోలీసులు ఎందుకు సీజ్ చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. చనిపోయినవారు స్థానికంగా లేని వారి పేర్ల జాబితాను వాలంటీర్లు వైకాపా నాయకులకు అందజేస్తే, వారు నకిలీ ఓటరు గుర్తింపుకార్డులు సిద్ధం చేశారని చంద్రబాబు ఆరోపించారు. దొంగఓట్లు వేసేవారిని సైతం పోలింగ్ బూత్‌ల వరకు వాలంటీర్లే తెచ్చారన్నారు. తిరుపతిలో తన బహిరంగ సభపై రాళ్లదాడి జరిగినా ఎలాంటి విచారణ జరపకుండానే అనంతపురం రేంజి డీఐజీ రాళ్లదాడి జరగలేదని ప్రకటించారని చంద్రబాబు లేఖలో ఆక్షేపించారు. వీటన్నింటిపైనా విచారణ జరపాలని సీఈసీని కోరారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ ప్రసాద్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిలు ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడ్డారు. 250 వాహనాలను పోలింగ్ రోజున వెనక్కి పంపామని డీజీపీ స్వయంగా చెప్పటంతో పాటు తెదేపా కార్యకర్తలు, నేతలు దొంగ ఓటర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా చర్యలు శూన్యం. పోస్టల్ బ్యాలెట్లను సైతం బలవంతంగా లాక్కున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి, ప్రజల విశ్వాసాన్ని పెంచేందుకు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంటులో రీపోలింగ్ నిర్వహించి తీరాలి. - చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి: కొవిడ్ నుంచి రక్షణ కోసం ప్రజలకు చంద్రబాబు సూచనలు