రాష్ట్ర ఎన్నికల సంఘంపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. మొదటిసారి మీడియా సమావేశం నిర్వహించిన సీఎం తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. కరోనా వైరస్ ప్రపంచం మొత్తం మహమ్మారిగా మారిందన్న చంద్రబాబు... కరోనా బారినపడిన వారి సంఖ్య ఇప్పటికే లక్ష దాటిపోయిందన్నారు. కరోనాతో ఇప్పటివరకు 5వేల మందికి పైగా చనిపోయారని.. చైనా, ఇటలీలో ఔషధాల దుకాణాలు తప్ప, అన్నీ మూసివేశారని తెలిపారు. మనుషుల ప్రాణాలకంటే ముఖ్యమా ఎన్నికలు అని ప్రశ్నించారు. జగన్ హిట్ లిస్టులో ఎన్నికల కమిషన్ కూడా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కరోనా అవగాహనపై చర్యలేవి?
నేపాల్, భూటాన్ నుంచి రాకపోకలను నిషేధించాలని నిన్న మోదీ ఆదేశించారని చంద్రబాబు గుర్తు చేశారు.
కరోనా వైరస్ పెద్ద సమస్య కాదని రెండ్రోజుల క్రితం చెప్పిన తెలంగాణ సీఎం.. నిన్న మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేయాలని చెప్పిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. వివాహాలు కూడా వాయిదా వేసుకోవాలని తెలంగాణ సీఎం చెప్పారన్నారు. కరోనా వ్యాప్తి చెందితే మనదేశంలో ఆస్పత్రులు కూడా సరిపోవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గ్రామాలన్నీ క్వారంటైన్లుగా మారిపోతాయన్నారు. కరోనాపై అవగాహన కల్పించే చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదని.. ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు ఈ సీఎంకు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాజ్యాంగం నుంచే అధికారాలు వచ్చాయి
రాజకీయాలు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి జగన్‌కు పట్టడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. కొన్ని దేశాల్లో విమానాశ్రయాలు పూర్తిగా మూసివేశారని.. ఒక రాష్ట్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. దేశం మొత్తానికి ప్రమాదమని హెచ్చరించారు. మనుషుల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌కు సర్వాధికారాలు ఎవరిచ్చారు?... రాజ్యాంగం నుంచే ఆయనకు అధికారాలు వచ్చాయని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: 'సీఎం కంటే ఎన్నికల కమిషనర్ ఎక్కువా?'