2014 నుంచి 2018 మధ్య దేశంలోని వివిధ నగరాల్లో గాలి నాణ్యతపై జరిపిన అధ్యయనంలో రాష్ట్రంలోని 13 నగరాల్లో కాలుష్యం పెరిగిందని కేంద్రం చెప్పింది. అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో స్వచ్ఛమైన గాలి నాణ్యత అత్యల్పంగా ఉన్నట్లు గుర్తించామని కేంద్ర సహాయ మంత్రి బాబుల్ సుప్రియో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌కాప్) కింద కాలుష్యం బారిన పడిన నగరాలల్లో గాలి నాణ్యతను మెరుగుపరచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. ఎన్‌కాప్‌లో భాగంగా వాయు కాలుష్యం బారినపడిన నగరాల్లో కాలుష్యం వెదజల్లే.. ప్రధాన కారణాలను గుర్తించడానికి పలు అధ్యయనాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్లపై ఆవరించే ధూళి కణాలు, వాహన కాలుష్యం, చెత్త తగులబెట్టడం, నిర్మాణ, కూల్చివేత పనులు, పారిశ్రామిక కాలుష్యం వంటివి నగరాల్లో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా గుర్తించినట్లు వెల్లడించారు. వాయుకాలుష్యం నుంచి నగరాలను కాపాడి.. గాలి నాణ్యతను మెరుగు పరిచేందుకు నగరాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు బాబుల్ సుప్రియో వివరించారు.
ఇదీ చదవండి: మమ్మల్ని కాపాడండి.. ప్రధానికి అమరావతి రైతుల లేఖ