Booster dose: బూస్టర్ డోసు పంపిణీ కోసం అదనంగా టీకాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిపై కేంద్రం స్పందించింది. 'బూస్టర్ డోస్ ఇవ్వాలని ఐసీఎంఆర్ సిఫార్సు చేస్తే అప్పుడు ఆలోచిస్తాం. అప్పటివరకూ బూస్టర్ డోసు ప్రస్తావన వద్దు' అని రాష్ట్రాల అధికారులకు కేంద్ర అధికారులు స్పష్టం చేశారు.
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో గురువారం వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీకాల పంపిణీ పురోగతిని కేంద్ర అధికారులు సమీక్షించారు. 'ఒమిక్రాన్' నేపథ్యంలో ఆరోగ్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు ఇచ్చే అవకాశం కల్పించాలని 3 రాష్ట్రాల అధికారులు కేంద్ర అధికారులను కోరారు. దీనిపై వారు స్పందించారు. 'బూస్టర్ డోసు అవసరమని అధికారికంగా మీకు ఎవరు చెప్పారు? ఐసీఎంఆర్ సిఫార్సు చేస్తే అప్పుడు ఆలోచిస్తాం. అప్పటివరకూ బూస్టర్ డోసు ప్రస్తావన వద్దు' అని రాష్ట్రాల అధికారులకు స్పష్టం చేశారు.