రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రాథమిక హక్కులను కాపాడుకునేందుకు అంతా సంఘటితంగా పని చేద్దామని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఇందుకోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రజాస్వామ్య వాదులు చేసే ప్రతి పోరాటానికీ తెదేపా మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యం-భావవ్యక్తీకరణ స్వేచ్ఛ’ అనే అంశంపై న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన వీడియో సమావేశంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ‘ప్రత్యర్థుల పై దేశద్రోహం కేసు పెడతారని నాకు ఇంతవరకు తెలీదు. మొదటిసారి చూస్తున్నా. నోటీసులు ఇవ్వకుండా కేసులు పెడుతున్నారు. ఎవరైనా నోరు తెరిస్తే వారి పనైపోతోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. టీవీ5, ఏబీఎన్‌పై రాజద్రోహం కేసులు పెట్టారు. మీడియాకు రాజకీయ నాయకులు భయపడటం మాని, రాజకీయ నాయకులను చూసి మీడియా భయపడే పరిస్థితి వచ్చింది’ అని అన్నారు.
నన్ను తుపాకీతో కాల్చేయమనలేదా?
‘జగన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను తుపాకీతో కాల్చేయాలని, చెప్పులతో, చీపుర్లతో కొట్టాలని, బంగాళాఖాతంలో పడేయాలని, ఉరి తీయాలని మాట్లాడారు. మేం ఏనాడు రాజద్రోహం కేసులు పెట్టలేదే? కులం గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు. కులాల గురించి కేసులు పెట్టాల్సి వస్తే మొదట వైకాపా నేతలపై సుమోటో కేసులు పెట్టాలి. అధికారం ఉందని ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు’ అని ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ‘ఎంపీ రఘురామ కృష్ణరాజు విషయంలో చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో హైదరాబాద్‌లో ఆర్మీ ఆసుపత్రికి తరలించే పరిస్థితి వచ్చింది. కోర్టులతో పరిమిత ఊరట మాత్రమే వస్తోంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. తప్పు చేస్తే శిక్షించడంలో తప్పు లేదు. ఆ తప్పేదో చెప్పడం లేదు’ అని ఆయన ధ్వజమెత్తారు. రఘురామపై ఇష్టానుసారంగా కేసులు పెడితే మాట్లాడటం తప్పా? ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడతాం. అధికారం శాశ్వతం కాదని హెచ్చరిస్తున్నా. చట్టాలు అమలుచేసే బాధ్యతను అందరూ తీసుకోవాలి. లేనిపక్షంలో రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుంది. తెదేపా ఎన్నో పోరాటాలు చేసింది. ఇప్పుడూ పోరాటాలను కొనసాగిస్తాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది: ముప్పాళ్ల సుబ్బారావు
పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో భావవ్యక్తీకరణ హక్కు ఉందని, విమర్శలను సద్విమర్శలుగా భావించకుండా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పోలీసుల కనీసం యూనిఫాం కూడా వేసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు సామాన్యులపైనే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని భావించామని, ఇప్పుడు ఎంపీలనే కొడుతున్నారని వివరించారు. మీడియాపై పెట్టిన దేశద్రోహం కేసులు వెంటనే ఎత్తి వేయాలని ఆయన డిమాండు చేశారు.
ప్రజలంతా కరోనాతో పోరాడుతుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, హక్కుల గురించి మాట్లాడుకునే దుస్థితి ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జగన్‌రెడ్డికి చెంపపెట్టని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ మాట్లాడుతూ రఘురామ విషయంలో తప్పొప్పులు పక్కనపెడితే ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని విమర్శించారు. రఘురామ భాష గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ప్రజలు చీత్కరించుకుంటారనే స్పృహ కూడా లేకుండా అధికార పార్టీకి చెందిన ఎంపీపైనే దేశద్రోహం కింద కేసులు పెట్టారని సీపీఎం నేత ఎంవీఎస్ శర్మ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో పౌర హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నందున న్యాయస్థానాలు కల్పించుకోవాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. సమావేశంలో ఏపీ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి సురేశ్, శ్రీమన్నారాయణ, హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు, జర్నలిస్టు సంఘాల తరఫున చందు జనార్థన్ తదితరులు మాట్లాడారు.
ఇదీచదవండి