నగరపాలక సంస్థ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. పోలింగ్ ప్రక్రియతోపాటు, కౌంటింగ్ కోసం దాదాపు 5వేల మంది సిబ్బందిని ప్రస్తుతం విధుల్లో ఉంచుతున్నారు. వీరికి ఇప్పటికే అవసరమైన శిక్షణ ఇచ్చారు. మరోసారి వారికి అవగాహన కల్పించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించనున్న సిబ్బందికి సైతం అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
144 వాహనాలు
ఎన్నికల సామగ్రి, సిబ్బందిని పోలింగ్ స్టేషన్లకు చేర్చేందుకు వీలుగా నగరంలోని సిటీరూట్ పరిధిలో ప్రత్యేకంగా 144 వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రధాన ప్రాంతాలు, ట్రాఫిక్ సమస్యలు లేని ప్రాంతాలకు చేరవేసేందుకు అనువుగా రెండేసి బస్సుల చొప్పున కేటాయిస్తారు. ఇరుకు సందుల్లోను, అంతర్గత రహదార్ల వెంట ఉన్న పోలింగ్ స్టేషన్లకు వెళ్లడానికి రెండేసి మినీ బస్సులు, ఇతర వాహనాలను సిద్ధం చేస్తున్నారు.
క్రీడా ప్రాంగణంలో సామగ్రి పంపిణీ..
నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో సిబ్బందికి మార్చి 9న ఎన్నికల సామగ్రి, స్టేషనరీ పంపిణీ చేసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల్లోపు ఈ ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు, పత్రాలు, ఇతర సామగ్రిని అక్కడ నుంచే అందిస్తారు. అందుకోసం అక్కడ ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
లెక్కింపునకు ప్రత్యేక ఏర్పాట్లు
నగరంలోని లయోలా కళాశాల ఆడిటోరియంలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడే ప్రత్యేకంగా రెండు స్ట్రాంగ్‌రూంలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి గుర్తింపునకు కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆమోదం తెలపడంతో అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. 10న ఎన్నికలు పూర్తయ్యాక మార్చి 14న అన్ని డివిజన్లలోని అభ్యర్థుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
23 టేబుళ్లు
కౌంటింగ్ కేంద్రంలో ప్రత్యేకంగా 23 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభించి మధ్యాహం 3 గంటలకల్లా పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 64 డివిజన్లకు సంబంధించి మూడు రౌండ్ల కింద ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లు చేపట్టేలా ఆదేశాలిచ్చారు.
800 మంది సిబ్బంది
నగరంలో 174 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 788 పోలింగ్ కేద్రాలు ఉండగా, 800 మంది సిబ్బందిని కేవలం కౌంటింగ్ కోసమే అధికారులు ఉపయోగిస్తున్నారు. వారికి లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధానం, ప్రవర్తనా నియమావళి వంటి అనేక విషయాలపై తగిన శిక్షణ ఇవ్వనున్నారు.
ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల్లేవ్..
ఈ సారి కార్పొరేషన్ ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరంగా ఉంచుతున్నారు. వారికి ఎటువంటి బాధ్యతులు అప్పగించలేదు. నగరపాలక సంస్థ. పరిధిలో దాదాపు 1000 మంది సిబ్బందిని ఆయా విధులకు వినియోగిస్తారు. మరో 4000 మందిని ఇతర విభాగాల నుంచి తీసుకుంటున్నారు.
తిరుగుబాటుకు బుజ్జగింపులు..!
పురపోరులో నామపత్రాల ఉపసంహరణ గడువు సమీపిస్తుండటంతో అలకలు, బుజ్జగింపులు ప్రారంభమయ్యాయి. బెదిరింపులు కూడా ఎక్కువయ్యాయి. ప్రధానంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఈ బెడద ఎక్కువైంది. టిక్కెట్లు ఆశించే వారు ఎక్కువగా ఉండటంతో దక్కనివారు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. గత ఏడాదిగా ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడంతో ఇప్పటికే కొంతమంది తామే గెలిచినట్లు వార్డు, డివిజన్ల ప్రతినిధులుగా ప్రచారం చేసుకున్నారు. ప్రస్తుతం టిక్కెట్లు తారుమారు కావడంతో రెబల్‌గా మారుతున్నారు. విజయవాడలో ప్రతిపక్షంలో అభిప్రాయభేదాలు బహిర్గంతమయ్యాయి. వైకాపాలోనూ అంతర్గతంగా నెలకొన్నాయి. జిల్లాలో మొత్తం అయిదు చోట్ల అభ్యర్థులు వివిధ కారణాలతో మరణించారు. వాటికి నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది.
విజయవాడ కార్పొరేషన్‌లో తెదేపా వ్యవహారం సద్దుమణిగిందని అనుకుంటే మరో కొత్త సమస్య వచ్చింది. 39వ డివిజను సమస్యను అధినేత పరిష్కరించారు. ఎంపీ బలపర్చిన శివశర్మకు టిక్కెట్ ఇచ్చారు. ఇంతకు ముందే బీఫారం ఇచ్చిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుచరురాలు పూజిత ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వెంకన్న ప్రచారంలో భాగస్వామ్యం వహించకుండా అలక వహించి హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ మీరాకు ఇప్పుడు ఇదే అనుభవం ఎదురైంది. 34వ డివిజనులో నాగుల్‌మీరా బలపర్చిన పొట్టేటి రమణ కాకుండా షేక్ సుభాని భార్య షేక్ విజయలక్ష్మికి టికెట్ ఖరారు చేశారు. దీంతో పొట్టేటి హనుమంతరావు కేశినేనిభవన్ వద్ద ఆందోళనకు దిగారు.
వాస్తవంగా ఇక్కడ వంగవీటి రాధా సూచించిన విజయలక్ష్మికి టిక్కెట్ ఇచ్చినట్లు తెలిసింది. 30వ డివిజనులో గోగుల రమణ, గరిమళ్ల చిన్నా వివాదం అలాగే ఉంది. ఇద్దరూ రంగంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ వైకాపాలోనూ టిక్కెట్ల పోరు నడుస్తోంది. పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెలంపల్లికి వ్యతిరేకంగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. టిక్కెట్లను అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. వైకాపాలోనే మరో వర్గంగా తయారయ్యారు. మధ్య నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గౌతం రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. కొంతమంది గౌతం రెడ్డిని ఆశ్రయించారు. ఆయన కుమార్తెను మేయర్ అభ్యర్థినిగా రంగంలోకి దించుతున్నారు. తూర్పులో ఇంఛార్జి దేవినేని అవినాష్ టిక్కెట్లు ఖరారు చేస్తున్నారు. తన అనుచరులకు బీఫారాలు అందజేస్తున్నారు.
పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికుమార్‌లు కూడా తమ అనుచరులకు ఆశిస్తున్నారు. తమ పార్టీలో ఎలాంటి రెబల్స్ ఉండబోరని, అన్ని సర్దుకుంటాయని వారు చెబుతున్నారు. బందరు కార్పొరేషన్‌లోనూ రెబల్స్ నామపత్రాలు దాఖలు చేశారు. నందిగామలో మాత్రం సర్దుబాటు చేసుకున్నారు. అధికారికంగా అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. వైకాపా కసరత్తు చేస్తోంది. నూజివీడు, పెడన, తిరువూరులలో కూడా అభ్యర్దుల ఎంపిక కసరత్తు చేస్తున్నారు. ఆది, సోమవారాల్లో ఖరారు చేసే అవకాశం ఉంది.