Cabinet Sub Committee on Orphans: తెలంగాణలో అనాథల సంరక్షణ కోసం నాణ్యమైన విద్య, ఉపాధి కల్పించి, కుటుంబం ఏర్పాటు చేసే విధంగా ఈ చట్టంలో ప్రత్యేక రక్షణలు కల్పించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అనాథల కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఈ సమావేశంలో తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్రత్యేక ఆహ్వానితులుగా బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌లో సబ్ కమిటీ భేటీ అయింది.
కొవిడ్ అనంతరం తెలంగాణలో అనాథలు ఉండకూడదనే సంకల్పంతో కేబినెట్ సబ్ కమిటీ వేసి వారికోసం సమగ్ర చట్టం చేసేందుకు నివేదిక ఇవ్వాలన్నారు. తెలంగాణలో అనాథలకు ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో అన్ని విధాల సాయం అందుతోందని మహిళాభివృద్ధి, శిశు, సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ తెలిపారు. తెలంగాణలో అనాథల కోసం నిర్వహిస్తున్న అనేక ఆశ్రమాలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి, వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని మంత్రులకు వివరించారు. అనాథల కోసం వచ్చిన ప్రతిపాదనల సమాహారాన్ని పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ ద్వారా వివరించారు.
వారిపై పీడీ చట్టం ప్రయోగించాలి
అనాథల కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది పిల్లలను అడ్డుపెట్టుకుని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని.. సిగ్నళ్ల వద్ద వారితో భిక్షాటన చేయిస్తున్నారని .. అలాంటి వారిపై పీడీ చట్టం ప్రయోగించాలని మంత్రి వర్గ ఉపసంఘం సూచించింది. భవిష్యత్‌లో ఇలా చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకునే విధంగా రానున్న నూతన చట్టంలో నిబంధనలు రూపొందించాలని అధికారులకు వివరించింది.
ప్రత్యేక ఐడీ కార్డులు
సిగ్నళ్ల వద్ద పిల్లలతో భిక్షాటన చేయించే వారిని గుర్తించి.. వారికి ప్రభుత్వ షెల్టర్ హోమ్స్‌లో వసతి కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని తెలిపింది. అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ వారికి ప్రత్యేక స్మార్ట్ ఐడీ కార్డులు ఇవ్వాలని, ఈ కార్డు ఉంటే ఇన్ కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ లాంటి ఇతర సర్టిఫికెట్లకు మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
టాక్స్ మినహాయింపుపై ప్రచారం చేయాలి
సమాజంలో చాలామంది వ్యక్తులు, వ్యవస్థలు ప్రత్యేక పిల్లలకు ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని మంత్రులు అన్నారు. అనాథలకు ఆర్థిక సాయం చేయడంతో టాక్స్ మినహాయింపు వస్తుందన్న విషయం అందరికీ తెలియదని... దీనిని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నారు. నో చైల్డ్ బిహైండ్ అన్న నినాదంతో అనాథల కోసం కార్పొరేట్ సోషల్ రెస్సాన్సీబిలిటీ కింద ముందుకు వచ్చే వారికి తగిన గౌరవం, గుర్తింపు ఇచ్చి వారి సాయం తీసుకోవాలన్నారు.
వారికోసం ప్రత్కేక నెట్ వర్క్
అనాథలందరికీ ఒక ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. వారు ఎప్పుడు కూడా అనాథల్లాగా భావించకుండా ఉండేందుకు ఈ నెట్ వర్క్ పనిచేసేలా చూడాలన్నారు. అనాథలుగా ఉంటూ గొప్ప, గొప్ప స్థాయికి చేరుకున్న వారి విజయగాథలను ఇక్కడ చెబుతూ వారిలో స్పూర్తి నింపాలన్నారు.
త్వరలో నివేదిక
దేశం గర్వించే విధంగా నివేదిక అతి త్వరలో సమర్పిస్తామని చెప్పారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకునే విధంగా మంత్రుల సూచనల ప్రకారం నివేదిక ఉంటుందన్నారు. కేబినెట్ సబ్ కమిటీ అనంతరం మంత్రులు, అధికారులు కలిసి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉన్న స్టేట్ హోమ్, అక్కడి విద్యార్థులు, పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం రసాయనాలు లేకుండా పండించేందుకు ఏర్పాటు చేసిన న్యూట్రి గార్డెన్‌ను సందర్శించి ప్రశంసించారు. ప్రభుత్వ బిడ్డలు ఉండే ఈ ప్రధాన కేంద్రం ఆహ్లాదకరంగా ఉండాలని.. అన్ని వసతులు కలిగి ఉండేందుకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుందని మంత్రులంతా హామీ ఇచ్చారు.