సీఎఫ్ఎంఎస్ (C.F.M.S) వ్యవస్థలో గందరగోళం కారణంగానే రూ.48 వేల కోట్లు మాయం అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని తాము కాగ్ దృష్టికి తీసుకెళ్లామని.. అయితే ఆ లేఖ వారికి చేరకపోవడం వల్లే అపార్థం తలెత్తిందని వివరణ ఇచ్చారు. అసలు 48 వేల కోట్ల నగదు మాయం అయ్యే అవకాశం ఉంటుందా ? అని ఆయన ప్రశ్నించారు. కార్పోరేషన్ల పేరిట రుణాలు తీసుకోవడం కొత్తేమీ కాదని.. గతంలో తెదేపా హాయాంలోనూ జరిగిందని బుగ్గన చెప్పుకొచ్చారు. సీబీఐ విచారణ చేయించాలన్న తెదేపా డిమాండ్‌పై స్పందించిన బుగ్గన.. తెదేపా హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు.
"రూ.48 వేల కోట్ల అవినీతి జరిగిందని తెదేపా ఆరోపిస్తోంది. రూ.100 కోట్లు అకౌంట్ మారినా బ్యాంకులు అప్రమత్తం అవుతాయి. రూ.48 వేల కోట్ల ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుంది. సీఎఫ్ఎంఎస్ నుంచి తప్పుల సవరణకు సమయం పడుతుంది. ప్రత్యేక బిల్లుల రూపంలో రూ.48,509 కోట్లు ఉన్నాయి. 15 అంశాల వారీగా ప్రతిదానికీ పద్దు ఉంది. నిధుల దుర్వినియోగం జరగలేదు.. అంశాలవారీగా కాగ్‌కు నివేదించాం. వైకాపా ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో లెక్కలు ఉన్నాయి. పేదవాడి కోసమే మేము అప్పు చేశాం. వైకాపా ప్రభుత్వం పిల్లల చదువు కోసం అప్పు చేస్తోంది. అన్యాయంగా, దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నిందించడం తప్పు." - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి
ఇదీ చదవండి: Yanamala: లొసుగులు బయటపడ్డాయనే నాపై విమర్శలు: యనమల