ఏటా సంక్రాంతికి ముందే విజయవాడ నగరవాసులను పలకరించే పండుగ పుస్తకమహోత్సవం నేటి నుంచి ప్రారంభంకానుంది. 31వ పుస్తక మహోత్సవాలను రాష్ట్రగవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నారు. ఉత్సవాలకు వేదికగా నిలిచేందుకు బెజవాడ స్వరాజ్య మైదానం ముస్తాబైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుస్తక విక్రయదారులు, ప్రచురణకర్తలు తరలివచ్చి స్టాళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 270 స్టాళ్లలో కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఉపయోగపడే వేలాది పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. తెలుగు, ఆంగ్ల నవలలు, ఇంజినీరింగ్, వైద్యం, ఆధ్యాత్మిక పుస్తకాలు ఒకేచోట లభించనున్నాయి. కొనుగోలుదారుల కోసం ప్రతి స్టాల్‌లోనూ పుస్తకాలపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ప్రదర్శనకు వచ్చే వారందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.
10 రోజుల్లో 10 లక్షల మంది వచ్చే అవకాశం
విజయవాడ పుస్తకమహోత్సవానికి దేశంలోనే మంచి పేరుంది. 10 రోజుల్లోనే సుమారు 10 లక్షల మంది పుస్తక ప్రియులు సందర్శిస్తుంటారు. భారీ సంఖ్యలో పుస్తకాల కొనుగోళ్లు జరుగుతుంటాయి. ఏటా జనవరి 1 నుంచి 11 వరకు జరిగే పుస్తక మహోత్సవాలు ఈ ఏడాది ఓ రోజు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్ నెలలో ముగిసే హైదరాబాద్ పుస్తకమహోత్సవం జనవరి 1 వరకు కొనసాగడమే దీనికి కారణమని నిర్వాహకులు చెబుతున్నారు. రోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మంచి పుస్తకం పేరిట వినూత్న చర్చా కార్యక్రమం ప్రవేశపెట్టనున్నారు..
పుస్తకాలు కొనేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి ఔత్సాహికులు తరలివస్తుంటారు. విద్యాలయాల నిర్వాహకులు సైతం గ్రంథాలయాలకు అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేస్తుంటారు.
ఇదీ చదవండి :