BONDA UMA DEEKSHA: విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నాచౌక్ లో తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ నిరసన దీక్ష చేపట్టారు. వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేశారని ఉమ విమర్శించారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తారా అని నిలదీశారు. కొత్త జిల్లాలతో ఉపయోగం ఏంటని..? కొత్త ఉద్యోగం ఒక్కటైనా వస్తుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా.. సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు ఉన్న ప్రాంతం, మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పేదల సమస్యల పై పోరాడుతూ ప్రాణాలు అర్పించిన వంగవీటి రంగా పేరు విజయవాడ జిల్లాకు పెట్టాలన్నారు. రంగా అభిమానులను కించ పరిచే విధంగా వైకాపా వ్యవహరిస్తోందని విమర్శించారు. అన్ని పార్టీలను కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఉద్ధృతం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ధర్నా చౌక్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు....
విజయవాడ ధర్నా చౌక్‌లోని ఎన్జీవో హోంకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు ఎన్జీవో హోంను ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో.. ఆ మార్గంలో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ధర్నాచౌక్ లోనే అమరావతి కోసం సీపీఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరుగుతోంది. కృష్ణా జిల్లాకు నందమూరి తారకరామారావు పేరు, పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ బొండా ఉమ నిరసన దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: కొండ చీలికలో చిక్కిన యువకుడు సేఫ్.. కాపాడిన ఆర్మీ