అమరావతి రాజధాని ప్రాంత రైతుల మహా పాదయాత్రకు భాజపా సంఘీభావం ప్రకటించింది. నెల్లూరు జిల్లాకు చేరుకున్న పాదయాత్రలో భాజపా రాష్ట్ర శాఖ తరఫున పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కృష్ణా జిల్లా నుంచి నెల్లూరు వరకు భాజపా ముఖ్యనేతలంతా ఈ యాత్రకు హాజరయ్యేందుకు తరలివెళ్లారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయం నుంచి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇతర నాయకులు పయనమయ్యారు. ఎంపీ సుజనాచౌదరి గన్నవరం విమానాశ్రయం నుంచి ర్యాలీగా ఈ యాత్రకు పయనమయ్యారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ కాజా నుంచి ఈ యాత్రలో పాల్గొంటుండగా... మరో ఎంపీ సీఎం రమేష్ నేరుగా నెల్లూరు జిల్లా కావలి వద్ద నుంచి రైతుల పాదయాత్రలో వారితోపాటు కలిసి నడవనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
అన్ని జిల్లాల్లోనూ భాజపా నాయకత్వం, కార్యకర్తలకు రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారని... రాజధాని అమరావతిలోనే ఉండాలన్నదే తమ పార్టీ ఆలోచనగా పురందేశ్వరి, సోము వీర్రాజు తెలిపారు. రాజధాని చుట్టూ కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది... చేపడుతోందన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భాజపా పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే విభజన చట్టంలోని 90 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు. ఎవరూ ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనేక విధాలుగా సహకరిస్తోందని తెలిపారు.
ఆంధ్ర రాష్ట్రానికి సాయపడే విషయంలో కేంద్రం ఎక్కడా మడప తిప్పలేదు ... మాట తప్పలేదని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక స్ధితి సరిగా లేకపోతే కేంద్రం నిధులు అందించిన విషయాన్ని ప్రజలంతా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అమరావతికి తాము కట్టుబడి ఉన్నామని గతంలోనే పార్టీ తీర్మానం చేసి- తమ అభిప్రాయాన్ని వెల్లడించామని... ఇప్పుడు ప్రత్యక్షంగా రైతుల మహాపాదయాత్రలో పాల్గొంటూ వారికి మరింత అండగా నిలుస్తామని చెప్పారు. శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తోన్న అమరావతి ప్రాంత రైతులపై పోలీసుల ఆంక్షలు, దౌర్జన్యాలు సరికాదన్నారు. రాష్ట్రానికి భాజపా సహకరించడం లేదనే మాట అవాస్తవమన్నారు.
ఇదీ చదవండి: గాంధీ-ముసోలిని భేటీ.. ఆంగ్లేయుల్లో కలవరం!