చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి తలుపులు మూసివేశామని భాజపా రాష్ట్ర వ్యవహారాల కో ఇన్‌ఛార్జి సునీల్ దియోదర్ తెలిపారు. వారితో ఎలాంటి వేదికలు పంచుకోబోమన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఎలాంటి అవినీతి ముద్రలేదని అన్నారు. తమ వేదికకు జనసేనానిని ఆహ్వానిస్తున్నామన్నారు.
ఐదు నెలల్లోనే వ్యతిరేకత
రాష్ట్రంలో రాజకీయ శూన్యత కనిపిస్తోందని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రాంతీయ పార్టీలతో పడుతోన్న ఇబ్బందులను ప్రజలు అర్ధం చేసుకుంటున్నందున.. భాజపా ఆంధ్రప్రదేశ్‌లో బలపడటం ఖాయమని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఐదు నెలల్లోనే వైకాపా సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ఇసుక సమస్యను ఇప్పటికీ పరిష్కరించలేకపోయారని విమర్శించారు. వరద నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. పత్రికాస్వేచ్ఛకు సంకెళ్లు వేసే ఉత్తర్వులు జారీ చేసి ఎవరూ ప్రభుత్వంపై విమర్శలు చేయకూడదనే ధోరణితో ప్రభుత్వం ఉందని సుజనా చౌదరి ధ్వజమెత్తారు. తొలి ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా ప్రజల నుంచి అభినందనలు పొందుతానని పేర్కొన్న జగన్మోహన్రెడ్డికి ఈ ఐదు నెలల్లో అలాంటి పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మరో నెలలో అద్భుతాలు ఏమైనా జరుగుతాయేమో చూడాలన్నారు. ఇసుక సమస్యపై నవంబరు నాలుగో తేదీన భాజపా రాష్ట్రస్థాయిలో భారీ ఆందోళన నిర్వహిస్తుందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు.