BJP leader Somu Veerraju fire: విఘ్నాధిపతి వేడుకలకు విఘ్నాలా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పండుగ జరుపుకోవడానికి అనుమతులు తప్పనిసరి చేయడం ద్వారా వైకాపా ప్రభుత్వం పండగ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని మండిపడ్డారు.
ఎన్నడూ లేని విధంగా వివిధ రకాల అనుమతులు పొందాలని డీజీపీ ద్వారా ఆదేశాలు జారీ చేయించి క్షేత్రస్థాయిలో మండపాల నిర్వాహకులను, ఉత్సవ సమితి సభ్యులను వేధిస్తూ.. ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక చవితి ఉత్సవాలకు దరఖాస్తు చేసిన వెంటనే సింగిల్ విండో సిస్టంలో అనుమతులు మంజూరు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
ఎలాంటి అనుమతులు తీసుకోం.. దమ్ముంటే అరెస్టు చేయండి: వినాయక చవితి వేడుకలకు నిబంధనలు పెట్టడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గణేశ్ ఉత్సవాలు ఎలా నిర్వహించాలో హైదరాబాద్ ఉత్సవాలు చూసి ముఖ్యమంత్రి జగన్ నేర్చుకోవాలని హితవు పలికారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాజమహేంద్రవరంలో నిర్వహించే వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటానని.. దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు.
గణేశ్ ఉత్సవ కమిటీలను ప్రభుత్వం అడ్డుకుంటే భాజపాకు సమాచారం ఇవ్వాలన్న వీర్రాజు.. వారికి భాజపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గణేశ్ నవరాత్రులు దగ్గర పడేంతవరకు కాలయాపన చేసి ఫైర్, విద్యుత్, పోలీసు పర్మిషన్ల పేరుతో ప్రభుత్వం ఉత్సవాలను పరోక్షంగా నిరోధించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పండుగల పట్ల కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. నిబంధనల పేరుతో పండుగను అడ్డుకోవాలనుకుంటే భాజపా చూస్తూ ఊరుకోదన్నారు.
ఇవీ చదవండి: