Drivers Problems: ఇంధన ధరల పెరుగుదలతో.. ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో వేల మంది ట్యాక్సీ, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో.. సొంత వాహనాలకు ఈఎమ్ఐలు చెల్లించలేక వాటిని అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. కొందరు వాహన యజమానులు నేడు డ్రైవర్లుగా మారుతున్నారు. కొవిడ్ వల్ల ఉపాధి దెబ్బతిని, నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగిపోవటంతో పూట గడవటం కూడా కష్టంగా మారింది. పెరుగుతున్న ఇంధన ధరలకు అనుగుణంగా వాహన ఛార్జీలు పెంచకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నెలలో 4 రోజులు కూడా గిరాకీ ఉండటం లేదని ట్యాక్సీ డ్రైవర్లు వాపోతున్నారు. ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నామని.. తమకు వేరే జీవనాధారం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తే.. అక్కడికి వచ్చిపోయే ప్రజలు, వ్యాపారస్తులతో తమకు గిరాకీ ఉండేదని ట్యాక్సీ డ్రైవర్లు అభిప్రాయపడుతున్నారు.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుంది ఆటోవాలాల పరిస్థితి. పెరిగిన ఇంధన ధరలు, గిరాకీలు లేక ఇబ్బందులు పడుతుంటే.. ఓలా, ఉబర్, రాపిడో వంటి వాటి వల్ల కిరాయిలు అసలే దొరకటం లేదని ఆటోడ్రైవర్లు వాపోతున్నారు. రోజుకు 200 కూడా మిగలటం లేదని.. కుటుంబపోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలను ప్రభుత్వం నియంత్రించాలని ట్యాక్సీ, ఆటోడ్రైవర్లు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
Autonagar Bandh: 50 శాతం పన్ను కట్టాలంటే మా వల్ల కాదు: వ్యాపారులు