ప్రపంచమంతా కరోనా కట్టడికి పోరాడుతుంటే జగన్ రెడ్డి మాత్రం తన రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధిస్తూ రాక్షసానందం పొందుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. టెస్ట్, ట్రీట్, ట్రేస్ విధానాన్ని చిత్తశుద్ధితో నిర్వహించట్లేదని మండిపడ్డారు. కరోనా పరీక్ష మొదలు చికిత్స వరకూ బాధితులు పడిగాపులు పడుతుంటే, సీఎం, మంత్రులు తూతూమంత్రంగా సమీక్షలతో చేతులు దులుపుకుంటున్నారన్నారు. తమ చేతకానితనాన్ని ప్రజలపై నెట్టేందుకు వైకాపా నేతలు యత్నించటం వారి దిగజారుడుతనానికి నిదర్శనంగా పేర్కొన్నారు.
ప్రభుత్వం చెప్పినంతగా ఆక్సిజన్ నిల్వలు లేకపోగా డిమాండ్‌కు సరిపడా సరఫరా జరగట్లేదన్నారు. కొవిడ్ ఆస్పత్రులను పునరుద్ధరించి, క్వారంటైన్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురాకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవటంతోపాటు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కీలక కేసులు.. చారిత్రక తీర్పులు