శాసనసభ సభాపతిని అగౌరవపరిచేలా బహిరంగంగా వాఖ్యలు చేసినందుకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని... తెదేపా శాసనసభ్యుడు కె.అచ్చెన్నాయుడికి నోటీసివ్వాలని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. అచ్చెన్నాయుడు సభాపతిపై వ్యాఖ్యలు చేశారని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన సభాహక్కుల సంఘం సోమవారం అసెంబ్లీలోని కమిటీ హాలులో సమావేశమై సమీక్షించి నిర్ణయం తీసుకుంది.
‘ఈ విషయంలో అచ్చెన్నాయుడు గతంలో ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు. ఫిర్యాదులోని అంశాలకు పూర్తిగా వివరణ ఇవ్వాలని నిరుడు డిసెంబర్‌లో, ఈ ఏడాది జనవరిలో రెండుసార్లు నోటీసులు పంపినా ఆయన స్పందించలేదు’ అని అధికారులు కమిటీకి నివేదించారు. దీంతో అచ్చెన్నాయుణ్ని కమిటీ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయనకు నోటీసివ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. అచ్చెన్నాయుడిపై ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి చేసిన మరో ఫిర్యాదుపైనా ఆయన వివరణ ఇవ్వలేదని అధికారులు తెలిపారు. దీనిపై అచ్చెన్నాయుడికి రిమైండర్ పంపాలని కమిటీ సూచించింది. మరో తెదేపా ఎమ్మెల్యే రామానాయుడిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపైనా కమిటీ సమీక్షించింది. ఆయనకూ నోటీసివ్వాలని తీర్మానించింది.
నిమ్మగడ్డపై విషయంలో ఏం చేస్తారో?
‘మాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు’ అంటూ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ చేసిన సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదుపైనా కమిటీ చర్చించింది. ‘కొవిడ్ పరిస్థితుల కారణంగా నేను ఎక్కువ దూరం ప్రయాణం చేయలేను’ అని గతంలో రమేశ్‌కుమార్ వివరణ ఇచ్చారని అధికారులు తెలిపారు. దీనిపై చర్చించిన కమిటీ సభ్యులు.. మరింత లోతుగా సమీక్షించాలని నిర్ణయించారు. ఆగస్టు 10న కమిటీ సమావేశంలో చర్చించి నిమ్మగడ్డపై చర్యలకు సిఫార్సు చేయడమా? ఆయన్ను వ్యక్తిగతంగా పిలిపించి వివరణ కోరడమా? ఫిర్యాదును ఇక్కడితో వదిలేయడమా అనేదానిపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు.
విజయవాడలో ఎమ్మెల్యే మల్లాది విష్ణును అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించకుండా ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డ అగ్నిమాపకశాఖ అధికారిపై ఏం చర్యలు తీసుకున్నారో పది రోజుల్లో సమాధానమివ్వాలని కృష్ణా కలెక్టర్‌కు నోటీసివ్వాలని కమిటీ ఆదేశించింది. సభాహక్కుల సంఘం సోమవారం మొత్తంగా 9 ఫిర్యాదులపై సమీక్షించింది. సభ్యులు వెంకట చినఅప్పలనాయుడు, వరప్రసాద్, శిల్పా చక్రపాణిరెడ్డి, మల్లాది విష్ణు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానంతరం కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్దన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ‘సభాహక్కులను ఉల్లంఘించినవారిని వివరణ కోరితే పొరపాటైంది.. ఇంకోసారి చేయం అని చెప్పడం పరిపాటిగా మారింది. ఇలాంటివారు ఉల్లంఘనకు పాల్పడటానికి కారణాలను పరిగణనలోకి తీసుకుని వారి నుంచి వివరణ కోరతాం. కొవిడ్ తీవ్రతను బట్టి అన్ని జిల్లాల్లోనూ పర్యటించాలని నిర్ణయించాం’ అని తెలిపారు.
ఇదీ చదవండి: