ఏపీఎస్ఆర్టీసీలోని కొన్ని బస్సులను డీజిల్ ఇంజిన్ స్థానంలో విద్యుత్ బ్యాటరీలతో నడిపేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు మార్పులు చేసేందు ప్రయత్నిస్తున్నారు. తిరుమల ఘాట్‌లో ప్రయోగాత్మకంగా నడిపిన విద్యుత్ బస్సు విజయవంతం అయింది. ఈ క్రమంలో అక్కడే మరిన్ని బస్సులు నడపాలని అధికారులు భావిస్తున్నారు.
కాలుష్యం తగ్గించాలనే..
తిరుపతి - తిరుమల ఘాట్, తిరుమలలో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో విద్యుత్ బస్సులు నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. గతంలో కొత్త విద్యుత్ బస్సులను నడపాలని అనుకున్నప్పటికీ, గుత్తేదారు.. ఎక్కువ ధరకు కోట్ చేయంతో ఆ ప్రతిపాదనను నిలిపివేశారు. అయితే ఇప్పుడు పాత వాటికే ఇంజిన్ మార్చి విద్యుత్ బస్సులుగా నడిపేందుకు సన్నద్ధమవుతున్నారు.
బ్యాటరీతో నడిపేలా మార్పులు..
అనంతపురానికి చెందిన వీర వాహన సంస్థ.. ప్రయోగాత్మకంగా ఆర్టీసీకి చెందిన ఒక సప్తగిరి ఎక్స్ ప్రెస్ పాత బస్సును బ్యాటరీతో నడిపేలా మార్పులు చేసింది. కొద్ది రోజుల క్రితం దానిని తిరుమల ఘాట్‌లో నడిపారు. అనుకున్నట్లుగానే ఛార్జింగ్‌కు సరిపడా మైలేజ్ వచ్చింది. దీంతో 150 బస్సులను బ్యాటరీతో నడిచేవిగా మార్చాలని అనుకుంటున్నారు. దాదాపు రెండేళ్ల పాటు వీటి పనితీరుని పరిశీలించిన తర్వాత రాష్ట్రంలో మరిన్ని సర్వీసుల్లో దీన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నారు.
పరిశీలనలో విద్యుత్ బస్సు..
తిరుమల ఘాట్‌లో విజయవంతంగా నడిపిన విద్యుత్ బస్సును ఆర్టీసీ అధికారులు పూణెలోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు (సీఐఆర్టీ)కి పంపారు. ఆ సంస్థ ఆమోదం తెలపాల్సి ఉంది. అలాగే ఇప్పుడున్న డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్పు చేసేందుకు ఎంత వ్యయమవుతుందనే అంచనాను కూడా ఆ సంస్థ తెలిపింది.
3 గంటలు ఛార్జింగ్.. 180 కిలోమీటర్లు
తిరుమల ఘాట్‌లో ప్రయోగాత్మకంగా నడిపిన బస్సు.. 3 గంటలు ఛార్జింగ్ పెడితే 180 కిలోమీటర్లు నడిచింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 పథకం కింద కొత్త విద్యుత్ బస్సులకు సాయం అందిస్తుండగా.. ఎపీఎస్ఆర్టీసీ మాత్రం ఇప్పుడప్పుడే వాటిని తీసుకునే ఆలోచనలో లేదని సమాచారం.
ఇదీ చూడండి: