హైదరాబాద్‌లోని బస్ భవన్ ను ఏపీఎస్ఆర్టీసీ దాదాపు ఖాళీచేసింది. ట్రస్టుల విభజన సమస్యలు, సహా పలు సాంకేతిక సమస్యలతో అక్కడే ఉండిపోయిన ఎస్ఆర్బీసీ, ఎస్బీటీ ట్రస్టులు, లీగల్ సెల్ విభాగాలను ఉన్నతాధికారులు విజయవాడకు రప్పించారు.
విజయవాడ నుంచే ఆర్టీసీ ఉద్యోగుల పీఎఫ్ ట్రస్ట్ సేవలు
హైదరాబాద్ బస్ భవన్ లో ఉన్న పీఎఫ్ ట్రస్టు కార్యాలయాన్నీ అమరావతికి తరలించారు. ఇకపై ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు పీఎఫ్ సంబంధిత క్లెయిమ్‌ల పరిష్కారంకోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచే పీఎఫ్ ట్రస్ట్ కార్యకలాపాలు జరగనున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఆఘమేఘాల మీద ఆర్టీసీ ప్రధాన కార్యాలయాన్ని, సిబ్బందిని అప్పట్లో ప్రభుత్వం తరలించింది. 2016 జూలైలో విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌కు ప్రధాన కార్యాలయం తరలివచ్చింది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో అదనంగా భవనాలను ఆర్టీసీ నిర్మించింది. మిగిలిన పలు ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు ఏర్పాట్లు చేసి తనవంతు సహకరించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బస్ భవన్ లో ఏపీఎస్ఆర్టీసీ...దూరప్రాంత విభాగం మాత్రమే, అతి కొద్ది మంది సిబ్బందితో కొనసాగుతోంది. విభజనతో వచ్చిన సమస్యలను క్రమంగా పరిష్కరించుకుంటూ వెళ్లడం... అన్ని విభాగాలను వేగంగా రాష్ట్రానికి తరలిరావడం, రాజధానిలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వ చొరవపై... ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.