APSRTC CARGO : రాష్ట్రవ్యాప్తంగా 129 బస్ డిపోలు, 423 బస్ స్టేషన్లు సహా పట్టణాల్లో పలు ప్రాంతాల్లో లాజిస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి సరకు రవాణా చేస్తున్న ఆర్టీసీ.. ప్రైవేటు కార్గో సర్వీసుల కంటే తక్కువ ధరకే సేవలందిస్తోంది. డిపోకు ఒక సరకు రవాణా వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించి ఎప్పటికప్పుడు పార్శిళ్లు చేరవేస్తోంది. పార్శిల్ బుక్ చేసినప్పటి నుంచి ఏ సమయానికి ఎక్కడికి చేరిందనే విషయాన్ని ఎప్పటికప్పుడు వెబ్ సైట్లో తెలుసుకునే అవకాశంతో పాటు బీమా సదుపాయం కూడా కల్పిస్తోంది. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి ప్రధాన బస్టాండ్లలో 24 గంటల బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ ప్రారంభించింది. క్యూ లైన్లో నిలుచునే అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మొబైల్‌లో వివరాలు నమోదు చేసి పార్సిల్ బుక్ చేసే ఏర్పాట్లు చేశారు.
ఏదైనా పార్సిల్ వస్తే డిపోల వద్దకు వెళ్లి జనం పార్సిళ్లు తీసుకోవాల్సిన పరిస్ధితి గతంలో ఉండేది. ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో పార్సిళ్లను ఇంటికి తెచ్చిచ్చే డోర్ డెలివరీ సర్వీసు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 154 చోట్ల ఈ సదుపాయం ఉంది. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి.. 50 కేజీలలోపు పార్సిళ్లను 10 కిలోమీటర్ల లోపు దూరానికి డోర్ డెలివరీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల్లోపే పార్శిళ్లు గమ్యస్థానానికి చేరుతున్నాయి.
24 గంటల బుకింగ్, డోర్ డెలివరీ సౌకర్యాలతో పార్సిళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో నెలకు వెయ్యి వరకూ డోర్ డెలివరీ పార్సిళ్లు బుక్ అయ్యేవి. ఇప్పుడు వీటి సంఖ్య నెలకు లక్షా 80 వేలకు చేరింది. ప్రస్తుతం కార్గో ద్వారా ఆర్టీసీ రోజుకు అర కోటి వరకు ఆర్జిస్తోంది. గతేడాది కార్గో ద్వారా 122కోట్లు సంపాదించిన ఆర్టీసీ.. సేవలు విస్తృత పరిచి ఆదాయం మరింత పెంచుకుంటామంటోంది. ఈ ఏడాది చివరి నాటికి ఆర్టీసీ బస్సులు నడుస్తోన్న అన్ని ప్రాంతాల్లోకీ పార్సిల్ సర్వీసును విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: