APSFSC Explanation to RBI about loans : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లు, సొసైటీలు, ఇతర సంస్థల నుంచి డిపాజిట్లు స్వీకరించి వాటిని వేరే ప్రభుత్వ కార్పొరేషన్లకు రుణంగా ఇస్తున్నామని రిజర్వు బ్యాంకుకు రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌సీ) స్పష్టం చేసింది. నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగు కంపెనీగా రిజర్వుబ్యాంకు వద్ద నమోదైన ఈ సంస్థలోకే ప్రభుత్వ సొసైటీలు, ట్రస్టులు, కార్పొరేషన్లు, బోర్డులు తమ మిగులు నిధులు డిపాజిట్ చేయాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే... ఈ సంస్థ చేసే వ్యాపారం ఏంటి? సేకరించిన డిపాజిట్లను తిరిగి ఎలా చెల్లిస్తుందన్న సందేహాలు వినిపించాయి. ఈ సంస్థ తీరుపై ఫిర్యాదులు వెళ్లడంతో రిజర్వుబ్యాంకు గతంలోనే స్పందించింది. ఈ సంస్థ ఎండీ, ఛైర్మన్‌ను ఉద్దేశించి 9 ప్రశ్నలు సంధిస్తూ అక్టోబరులోనే లేఖ రాశారు. ఇందుకు స్పందించిన ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌సీ సమాధానం చెప్పింది. విశ్వసనీయ సమాచారం మేరకు అందులోని విషయాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల నుంచి నిధులు డిపాజిట్లుగా స్వీకరిస్తున్నాం. వాటిని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లకే వడ్డీపై ఇస్తున్నాం. ఆ ఆదాయంతో డిపాజిట్ చేసిన సంస్థలకు తిరిగి చెల్లిస్తాం. ఇదే మా కార్యకలాపం.
- 2021 మార్చి 31 వరకూ మేం ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించలేదు. అంతర్గత కార్పొరేట్ డిపాజిట్లు స్వీకరించలేదు. తర్వాత జులై 17 నుంచి డిపాజిట్ల స్వీకరణ ప్రారంభించాం. ఆగస్టు 31 నాటికి రూ.659.54 కోట్లు స్వీకరించాం.
- గుంటూరు కలెక్టరేట్ నుంచి రూ.కోటి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (రూ.50 కోట్లు) ఏపీ మ్యారిటైం బోర్డు (రూ.200 కోట్లు), పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కార్పొరేషన్ (రూ.300 కోట్లు) సాంకేతిక విద్యాబోర్డు (రూ.30కోట్లు) విశాఖ కలెక్టరేట్ (రూ.50 కోట్లు), ఉన్నత విద్యామండలి (రూ.26 కోట్లు) నుంచి ఆగస్టు నెలాఖరు వరకు డిపాజిట్లు స్వీకరించాం.
- ఈ మొత్తాన్ని ఏపీఎస్‌డీసీకి 6% వడ్డీతో రుణంగా ఇచ్చాం.
- కంపెనీ కార్యకలాపాలకు అవసరమైన మార్జిన్‌మనీ కోసమే ఈ రుణం ఇచ్చాం.
- ప్రభుత్వ సంస్థలకు ఇస్తున్న రుణాలకు వసూలు చేసే వడ్డీ ఆధారంగానే డిపాజిట్లకు వడ్డీ చెల్లిస్తాం.
అనేక ప్రశ్నలు...
APSFSC Explanation to RBI about loans : ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌సీ ద్వారా సమీకరిస్తున్న నిధుల నుంచి అప్పులిచ్చి, తిరిగి వాటిని వడ్డీతో వసూలు చేసుకుని చెల్లిస్తామంటున్న ఈ ప్రక్రియ.. ప్రభుత్వంపై భారం మోపేదే అని ఆర్థికశాఖ విశ్రాంత అధికారులు, నిపుణులు చెబుతున్నారు. తాము రుణాలిచ్చేది ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లకు, సంస్థలకేనని రిజర్వుబ్యాంకుకు ఇచ్చిన సమాధానంలోనే స్పష్టం చేసింది. ఆ కార్పొరేషన్‌కు సొంతంగా వ్యాపార కార్యకలాపాలు, ఆదాయ మార్గాలు లేవు. ప్రభుత్వం ఇప్పటికే అదనపు ఎక్సైజ్ సుంకం విధించి, ఆ మొత్తాన్ని బ్యాంకుల కన్సార్షియంకు ఎస్క్రో చేసి రూ.25,000 కోట్ల రుణం తీసుకుంది. ఇందుకు విశాఖలోని ప్రభుత్వ భూములను తనఖా పెట్టింది. ఆ కార్పొరేషన్ ఇప్పుడు తీసుకున్న ఈ కొత్త రుణాన్ని ఏదో ఒక మార్గంలో మళ్లీ ప్రభుత్వమే చెల్లించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ కార్పొరేషన్ డిపాజిట్ల స్వీకరణ, అప్పులు ఇవ్వడం ప్రభుత్వంపై అదనపు భారంగానే విశ్లేషిస్తున్నారు.
ఇవీచదవండి.