ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 121 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు సీఐడీ విచారణలో గుర్తించామని..ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్(APSFL) ఛైర్మన్ పి. గౌతమ్ రెడ్డి తెలిపారు. సాంకేతిక పరికరాలు సంస్థకు చేరకుండానే బిల్లులు మంజూరు చేశారని..వీటితో పాటు సాంకేతికపరంగా పలు రకాల అవకతవకలు జరిగాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెరా సాఫ్ట్ సంస్థను బ్లాక్ లిస్టు తొలగించారని.. దీనిపై అభ్యంతరాలు, ఫిర్యాదులను పట్టించుకోలేదున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 18మందిని అనుమానితులుగా గుర్తించి సీఐడీ కేసులు నమోదు చేశారన్నారు. బాధ్యులు ఎంతటి వారైనా సరే సీఐడీ చర్యలు తీసుకుంటుందన్నారు.
'' రూ. 300 బేసిక్ ప్యాకేజీని మరో రూ. 50 పెంచాలని నిర్ణయించాం. నెట్ ఫ్రీ, ఫోన్ ఫ్రీ, కేబుల్‌కి మాత్రం ఛార్జీ వసూలు. ఏపీఎస్ఎఫ్ఎల్ పై దుష్ప్రచారాలను నమ్మకండి. సంస్థ రాష్ట్రంలో సేవలు అందించి తీరుతుంది'' - గౌతమ్ రెడ్డి, APSFL ఛైర్మన్.
ముగ్గురికి సీఐడీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ తొలిదశ టెండర్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై నమోదైన కేసులో... ముగ్గురికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. టెండర్ల సాంకేతిక మదింపు కమిటీలో సభ్యుడిగా వ్యవహరించిన వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఇన్‌క్యాప్ అప్పటి ఎండీ కె.సాంబశివరావు, టెరా సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ తుమ్మల గోపీచంద్‌కు ఈ నోటీసులు ఇచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి:
Skill Development: ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కళాశాల: సీఎం జగన్