HC on New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు అధికరణ 371-డికి విరుద్ధమైతే ఆ అభ్యంతరాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. ఈ విషయంలో అధికరణ 371-డి ప్రస్తావన ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఇచ్చింది ముసాయిదా నోటిఫికేషన్ మాత్రమేనని.. ఈ దశలో దానిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తుది ప్రకటన తర్వాత అభ్యంతరాలుంటే కోర్టుకు రావాలని పేర్కొంది. కౌంటర్లు వేయాలంటూ... వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలిచ్చింది.
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 25న ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి, ఆ సందర్భంగా ఇచ్చిన 26 జీవోలను రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా అప్పాపురం గ్రామానికి చెందిన దొంతినేని విజయ్‌కుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి.సిద్ధార్థ, ఒంగోలుకు చెందిన జాగర్లమూడి రామారావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై నిషేధం ఎక్కడుందో చూపాలని విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే... ప్రతి కొత్త జిల్లా ఒక లోకల్ ఏరియా అవుతుందిగా అని వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి: