AP crime news: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో నలుగురు మరణించారు.
దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి
కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులోకి కారు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు కుటుంబీకులు ప్రయాణిస్తుండగా.. వారిలో ఇద్దరు క్షేమంగా బయటపడగా.. మరో ఇద్దరు మృతి చెందారు. మృతులు చంద్రగుప్త(78), కేదార్ నాథ్(27)గా గుర్తించారు. కర్ణాటక నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
జమ్మలమడుగులో..
కడప జిల్లా జమ్మలమడుగు మండలం గొరిగనూరు గ్రామం వద్ద.. ఎర్రచందనం తరలిస్తున్న స్కార్పియో వాహనం దగ్దమైంది. వాహనం సహా అందులోని ఎర్రచందనం దుంగలు కాలిపోయాయి. వాహనానికి 200 మీటర్ల ముందు మరో కారు ఆగి ఉండగా.. ఆ కారుని స్కార్పియో వాహనానికి పైలెట్ వాహనంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
గుంటూరు జిల్లా పిరంగీపురం మండలం అల్లంవారిపాలెంలో.. ఓ కౌలు రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొత్తం ఇరవై ఎకరాల్లో పత్తి, మిరప సాగుచేయగా.. తెగుళ్లు, అకాల వర్షాలతో పంటనష్టం వాటిల్లింది. పంటకోసం చేసిన అప్పులు ఎక్కువవటంతో.. అంకులయ్య కొంతకాలంగా మనోవేదనకు గురై.. పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు.. కుటుంబసభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు తెలిపారు.
లారీ, బస్సు ఢీ..
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శివారులోని బుడమేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్సు ఢీకొన్న ఘటనలో పలువురి గాయాలయ్యాయి. ఈ ఘటనతో చెన్నై-కోల్కత్తా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో వాహనాలు రోడ్డుపై నిలిపోయాయి.
విద్యార్థినిపైకి దూసుకెళ్లిన లారీ..
చెల్లిని పాఠశాలలో దిగబెట్టి తిరిగి వస్తున్న ఓ యువతి మృతిచెందింది. విజయవాడ నగర శివారులోని బల్లెంవారి వీధిలో విద్యార్థిని ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొంది. దీంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
బస్సులో ప్రయాణిస్తున్న 20మందికి గాయాలు..
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని కొత్తపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి గుత్తికి వస్తున్న ఆర్టీసీ బస్సు.. ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి : AP Crime News: వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి.. పలువురు అరెస్టు