Case Against RI Aravind: కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటురులో అక్రమ తవ్వకాల కేసు మరో మలుపు తిరుగుతోంది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరవింద్ లక్ష రూపాయల నగదు డిమాండ్ చేసినట్లు గంటా లక్ష్మణ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా గుడివాడ రూరల్ పోలీసులు ఆర్ఐ పై 323, 506, 384, 511 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గ్రామస్తులు మట్టి కావాలని కోరగా తన స్థలంలోని మట్టిని తవ్వి వారికి పంపే విషయంపై ఆర్ఐతో మాట్లాడానని, మట్టిని తవ్వి, రవాణా చేసినందుకు తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఆర్ఐ డిమాండ్ చేశారని, తాను ఏప్రిల్ 23న నగదు ఇస్తానని ఒప్పుకున్నట్లు గంటా లక్ష్మణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 21 అర్ధరాత్రి 11.45 గంటలకు మట్టిని తవ్వుతుండగా హఠాత్తుగా ఆర్ఐ అరవింద్ ఘటనా స్థలానికి వచ్చి నగదు డిమాండ్ చేశారని .. తమను భయపెట్టారని తెలిపారు. డబ్బులివ్వకపోతే తవ్వకాలను నిలిపివేయాలని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు. తాను శనివారం నగదు ఇస్తానని ఆర్ఐ కి చెప్పినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. ఆర్ఐ ఉద్దేశపూర్వకంగానే సంఘటనా స్థలానికి వచ్చారని.. తనను బెదిరించారని గంటా లక్ష్మణ్ తెలిపారు. సంఘటన ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి జరగ్గా.. పోస్టు ద్వారా ఈ నెల 24న ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు.
వైకాపా మైనింగ్ మాఫియా అరాచకాలకు ఈ ఘటనే సాక్ష్యం: నారా లోకేశ్
ఆర్ఐ అరవింద్ పై కేసు పెట్టడంపై లోకేశ్ మండిపడ్డారు. జగన్‌రెడ్డి రివర్స్ పాలనలో బాధితులపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి తవ్వకాన్ని అడ్డుకున్నారని ఆర్‌ఐపైనే దాడి చేయడమే కాకుండా లంచం కేసు పెట్టడం దుర్మార్గమని దుయ్యబట్టారు. వైకాపా మైనింగ్ మాఫియా అరాచకాలకు ఈ ఘటనే సాక్ష్యమని లోకేశ్ అన్నారు. నిజాయితీ గల అధికారుల మనోస్థైర్యం దెబ్బతీయడమై వైకాపా లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఆర్‌ఐపై కేసులోనూ మరోసారి కోర్టులో మొట్టికాయలు తినడం ఖాయమని హెచ్చరించారు. వైకాపా నిరంకుశత్వంపై పోరాడే వారికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని లోకేశ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : Attack: విశాఖ కేజీహెచ్‌లో అరాచకం.. ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వద్దన్నందుకు దాడి