విజయవాడ నగరంలోని పటమటలంక ప్రాంతం ఒకప్పుడు పల్లెటూరు. ఏ ఇల్లు చూసినా వివిధ రకాల మొక్కలతో పచ్చదనంతో నిండి ఉండేది. అదే ప్రాంతానికి చెందిన చెన్నుపాటి దమయంతికి బాల్యం నుంచే మొక్కలంటే మమకారం. నగరీకరణలో భాగంగా ఆమె ఇంటి రూపం మారినా, పచ్చదనం స్థానం మాత్రం మారలేదు. ఇంటి స్థలంలో సగభాగాన్ని మొక్కలతో నింపేశారు. ఎనిమిది పదుల వయసులోనూ చలాకీగా తిరుగుతూ... పచ్చదనంతో ఆనందాన్ని పొందుతున్నారు. ప్రతిరోజూ మొక్కల బాగోగులు చూసుకునేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇంటి ఆవరణాన్ని పూలు, పండ్లు, కూరగాయల మొక్కలతో నింపేశారు.
రసాయనాలు వాడకుండా..
దమయంతి తన ఇంట్లోని మొక్కలకు ఎలాంటి పురుగు మందులు వాడకుండా... పూర్తిగా సేంద్రియ విధానంలో పెంచుతున్నారు. రాలిన ఆకులు, కొమ్మలు, వంటింటి వ్యర్థాలు బయట పడేయకుండా మొక్కల మధ్యలోనే చిన్న గొయ్యిలా తవ్వి అందులో వేస్తారు. అవి సేంద్రియ ఎరువులా తయారవుతున్నాయి. ఇంట్లో పడిన వర్షపు నీటిని వృథాగా బయటికి పోనీయకుండా... భూగర్భంలో ఇంకిపోయేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కువ శాతం ఇంట్లో పండించిన కూరగాయలనే వండుకొని తింటానని దమయంతి అంటున్నారు. ఇంటి ముందు నేరేడు, పారిజాతం వంటి వివిధ రకాల మొక్కలు నాటి ఆ ప్రాంతాన్ని ఆహ్లాదంగా మార్చారు దమయంతి.