కరోనా పాజిటివ్ కేసులతో తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఇంతకాలం ఇబ్బంది లేకుండా తిరిగిన ప్రజలంతా... కొవిడ్-19 కేసులతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. నల్గొండ జిల్లాలో ఆరుగురికి వైరస్ సోకగా... సూర్యాపేట జిల్లాలో ఒకరికి నిర్ధారణైంది. నల్గొండ పట్టణంలోని మీర్బాగ్ కాలనీలో ఇద్దరికి, బర్కత్ పుర, రహమత్ నగర్, మన్యంచెల్క ప్రాంతాలకు చెందిన ఒక్కొక్కరికి... కొవిడ్-19 సోకింది. మిర్యాలగూడకు చెందిన మహిళ కూడా వ్యాధి బారిన పడింది. ఇక సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యక్తికి... వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. కరోనా సోకినవారంతా దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లివచ్చారు.
నల్గొండలో 40, యాదాద్రి భువనగిరి జిల్లాలో 12, సూర్యాపేట జిల్లాలో 11 మందికి పరీక్షలు నిర్వహించగా... నల్గొండలో ఆరుగురికి, సూర్యాపేటలో ఒకరికి వైరస్ సోకినట్లు నిర్ధరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పన్నెండు మందికి గాను... మొత్తం అందరికీ నెగెటివ్ ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ నెల 18, 19 తేదీల్లో దిల్లీ నుంచి స్వగ్రామాలకు చేరుకున్నారు. ఇక రోగులకు సంబంధించిన 39 మందిని... క్వారంటైన్లో ఉంచారు.
నల్గొండలో కేసులు వెలుగుచూసిన ప్రాంతాల్ని రెడ్ జోన్లుగా చేసి... రాకపోకల్ని పూర్తిగా కట్టడి చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. మొత్తం 40 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొనగా... అందులో ఆరుగురికి పాజిటివ్, 34 మందికి నెగెటివ్ వచ్చింది. నెగెటివ్ వచ్చిన వారందర్నీ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. మిర్యాలగూడ సీతారాంపురం కాలనీకి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా... ఆ కాలనీ మొత్తాన్ని దిగ్బంధనం చేశారు.
సూర్యాపేట జిల్లాలోనూ ఒకరికి పాజిటివ్ నిర్ధరణైంది. దీంతో సదరు వ్యక్తి తిరిగివచ్చిన ప్రాంతాలన్నింటిపైనా... అధికారులు దృష్టిసారించారు. రెండు ప్రార్థనాలయాలకు వెళ్లిన కరోనా బాధితుడు... మరో రెండు ఔషధ దుకాణాల వద్ద సంచరించినట్లు గుర్తించారు. దీంతో మందుల దుకాణాల్లో పనిచేసే వారితోపాటు... ప్రార్థనాలయాల్లో ఉన్నవారిని గుర్తించి క్వారంటైన్‌కు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు జిల్లాల పరిధిలో ఐసోలేషన్ కేంద్రాల్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల విదేశీయులతో పాటు... కరోనా అనుమానమున్న వారిని ఆయా కేంద్రాలకు తరలించారు.
ఇవీ చూడండి: