జిల్లాలవారీగా చూస్తే.. గుంటూరు-8, అనంతపురం-7, కృష్ణా-6, నెల్లూరు-5, ప్రకాశం-3, చిత్తూరు-3, కర్నూలు-1, పశ్చిమగోదావరి-1 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో దాదాపు సగం (49.42%) కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోనే ఉన్నాయి. కరోనా మహమ్మారి పసిపిల్లలనూ వదలడం లేదు. నెల్లూరు జిల్లాలో బుధవారం ముగ్గురు చిన్నారులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తడకు చెందిన ఓ వ్యక్తి ఇప్పటికే ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, ఆయన పిల్లలిద్దరికి కరోనా సోకింది. వాకాడులో మరో పదేళ్ల పాపకూ వ్యాధి సంక్రమించింది. ఇటీవల కరోనా వచ్చిన వైద్యుడి భార్యకు, ఆయన వద్ద పనిచేసే ఓ టెక్నీషియన్‌కు పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
కర్నూలులో అత్యధికం
ఇప్పటిదాకా రాష్ట్రంలో 348 కొవిడ్ కేసులు నమోదవ్వగా... అత్యధికంగా కర్నూలు జిల్లాలో 75 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఈ పరిస్థితుల్లో కేసులు నమోదైన 6 మున్సిపాలిటీలు, 13 మండలాల్లో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. కరోనా రోగుల బంధువుల్ని క్వారంటైన్లకు తరలించడం, వారి నమూనాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. మంత్రి బుగ్గన రాజేంథ్రనాధ్‌రెడ్డి, కలెక్టర్ వీరపాండియన్... నంద్యాల శాంతిరామ్ కోవిడ్ ఆసుపత్రిని సందర్శించారు.
గుంటూరులో నమోదైన కేసులన్నీ నగరంలోనే..
గుంటూరు జిల్లాలో బుధవారం నమోదైన 8 కేసులతో కలిపి... వ్యాధిబారిన పడిన వారి సంఖ్య 49కి చేరింది. కొత్తగా నమోదైన కేసులన్నీ నగరంలోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆనందపేటలో 3, కుమ్మరి బజారులో 2 , యానాదిపేట, కొరిటపాడు, అరండల్ పేటలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయ్యాయి. గుంటూరు ప్రభుత్వ ఐడీ ఆసుపత్రి, గురు క్వారంటైన్ కేంద్రాన్ని హోంమంత్రి సుచరిత పరిశీలించారు. రెడ్‌జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
నెల్లూరులో ప్రత్యేక చర్యలు
నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 48కి చేరాయి. నగరంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు గుర్తించిన అధికారులు... ప్రత్యేక చర్యలు చేపట్టారు. జీజీహెచ్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 50వేల మంది ఉద్యోగులు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. 50మంది ప్రైవేట్ వైద్యులు, 20మంది ఆయుష్ వైద్యులు, హౌస్ సర్జన్లు, పారామెడికల్ సిబ్బందితో కలిపి... 200మంది పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
కృష్ణాలో 19 క్వారంటైన్ కేంద్రాలు
కృష్ణా జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 35కి చేరింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 క్వారంటైన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కడప జిల్లాలో ఇప్పటిదాకా 918 నమూనాలు పరీక్షించగా... 28 కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇంకా 392 మంది నమూనాల వివరాలు రావాల్సి ఉంది. దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన 86 మందిని గుర్తించడమే కాకుండా... వారితో సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులు, స్థానికులను కలిపి 300 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్‌వో వెల్లడించారు.
పలు జిల్లాల్లో పెరుగుతున్న కేసులు
ప్రకాశం జిల్లాలో 27, పశ్చిమగోదావరి జిల్లాలో 22, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలో 20 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. విశాఖలో ముగ్గురిని డిశ్చార్జి చేసినట్టు అధికారులు తెలిపారు. మదీనా నుంచి తిరిగొచ్చిన రోగి బంధువైన 49 ఏళ్ల మహిళను కూడా పరీక్షల తర్వాత డిశ్చార్చి చేసినట్టు వెల్లడించారు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన యువకుడితో పాటు మరో వ్యక్తిని డిశ్చార్జి చేసినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అనంతపురం జిల్లాలో కేసుల సంఖ్య 13కి చేరాయి. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 11గా ఉంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 34 కరోనా పాజిటివ్ కేసులు