పంచాయతీ నిధులను ఎప్పుడు వేటికి రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తుందోనన్న అనుమానాలతో పనుల నిర్వహణకు పాలకవర్గాలు మొగ్గు చూపడం లేదు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికే చాలా మంది సర్పంచులు పరిమితమవుతున్నారు. రాష్ట్రంలో 13,095 గ్రామ పంచాయతీలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొంది దాదాపు 4నెలల తరువాత చెక్‌పవర్ పొందిన సర్పంచులు ఏదేదో చేయాలని ఆరాటపడి.. పరిస్థితులు చూసి చివరకు నిరాశ చెందుతున్నారు.
పేరుకే ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు
నిర్దేశిత మార్గదర్శకాలకు లోబడి గ్రామాల్లో ప్రగతి పనులను చేపట్టేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించవచ్చు. 80 నుంచి 85శాతం పంచాయతీల్లో పనుల కోసం తీర్మానించినా ముందడుగు పడటం లేదు. 14వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామ పంచాయతీల్లో లోగడ చేసిన పనులకే రూ.350 కోట్లకుపైగా బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఈ క్రమంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో పనులంటేనే అత్యధిక పంచాయతీలు వెనకడుగు వేస్తున్నాయి. పనుల బిల్లులు అప్‌లోడ్ చేశాక ఎప్పుడు విడుదలవుతాయో తెలియక సర్పంచులు చొరవ చూపడం లేదు. 14వ ఆర్థిక సంఘం నిధుల్లోనుంచి పంచాయతీలు విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల కోసం రూ.344.93 కోట్లు మళ్లిస్తూ నెల కిందట ప్రభుత్వం జీవోనిచ్చింది. పంచాయతీ పాలకవర్గం తీర్మానించకుండానే నిధులు మళ్లించడంపై పలువురు సర్పంచులు సైతం విస్మయం వ్యక్తం చేశారు.
సాధారణ నిధుల విడుదలలోనూ జాప్యం
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పన్నుల కింద ఏటా దాదాపు రూ.900 కోట్లు, పన్నేతర రూపంలో రూ.500 కోట్లు వస్తాయని అంచనా. ఈ మొత్తాలు ప్రభుత్వ ఖాతాలో జమవుతుంటాయి. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, సిబ్బంది జీతాలు, ఇతర అత్యవసర పనులకు పంచాయతీలు సాధారణ నిధులను వెచ్చిస్తుంటాయి. ఈ మేరకు సీఎఫ్‌ఎంఎస్ విధానంలో బిల్లులు అప్‌లోడ్ చేసిన పంచాయతీలకు తిరిగి విడుదలలోనూ జాప్యం జరుగుతోంది. కొన్ని బిల్లులే ఆమోదించి మిగతావి పక్కన పెడుతున్నారు. ప్రత్యేకించి ఆదాయం అంతంతే ఉండే 7 వేల పంచాయతీల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది.
* ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామపంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.70 లక్షలతో పనులు చేయించాలని పాలకవర్గం ఇటీవల తీర్మానించింది. కానీ ఆ తర్వాత ముందడుగు పడటం లేదు. ఇప్పటికే పనులు చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.50 లక్షల బిల్లులు ఇంకా చెల్లించలేదు. దీంతో కొత్తగా మళ్లీ పనులు చేయించేందుకు పాలకవర్గ సభ్యులు ఆసక్తి చూపడం లేదు.
* విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో అత్యంత తక్కువ ఆదాయమున్న గ్రామ పంచాయతీల్లో ఎంఆర్ ఆగ్రహారం ఒకటి. కొత్తగా రోడ్లు, కాలువల పనులు చేపట్టాలన్నా.. ఉన్న వాటికి మరమ్మతు చేయాలన్నా ఆర్థిక సంఘం నిధులే దిక్కు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణకు సాధారణ నిధులు (జనరల్ ఫండ్స్) సరిపోవు. సాధారణ నిధుల కొరత, ఆర్థిక సంఘం నిధుల కోసం బిల్లులు పెడితే సకాలంలో వస్తాయో.. రావో తెలియక ఈ పంచాయతీలో కొత్తగా పనులు చేయడం లేదు.
ఇదీచదవండి.