రాష్ట్రంలో 12 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనుమానిత లక్షణాలున్న 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... వీటిలో 317 శాంపిల్స్ నెగెటివ్‌గా వచ్చాయని తెలిపారు. ఇంకా 55 మందికి సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సర్వే దాదాపు పూర్తైందని...సర్వేలో 28028 మంది విదేశాల నుంచి వచ్చినట్లుగా తేలిందని తెలిపారు. వారందరినీ స్థానిక అధికారుల పర్యవేక్షణలో గృహ నిర్బంధంలో ఉంచామన్నారు.
కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 3 పాజిటివ్ కేసులు నమోదైన దృష్ట్యా నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించినట్లు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో చాలా తక్కువ స్థాయిలో కరోనా ఉందన్న మంత్రి ఆళ్ల నాని... భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కరోనా అంతం కాదన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా సహకరించాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.
ఇదీ చదవండి: 'ఆపరేషన్ నమస్తే' పేరుతో కరోనాపై సైన్యం యుద్ధం