Argument between TTD staff and UP actress Archana Gautham: తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలపై ఉత్తర్‌ప్రదేశ్ నటి అర్చనా గౌతమ్.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నటి అర్చన గౌతమ్.. సిఫారసు లేఖతో బ్రేక్ దర్శనానికి తిరుమల వచ్చారు. బ్రేక్ దర్శన సమయం మించిపోవడంతో... మరుసటి రోజు రావాలని తితిదే అధికారులు సూచించారు. దీనిపై తితిదే సిబ్బంది, నటి అర్చన గౌతమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై నటి అర్చన గౌతమ్.. తిరుమల యాత్రలో తాను ఎదుర్కొన్న సంఘటనల స్వీయ దృశ్యాలను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రూ.10,500లకు బ్రేక్ దర్శన టికెట్లు విక్రయిస్తూ.. దోపిడికి పాల్పడుతున్నారంటూ తీవ్రస్ధాయిలో వ్యాఖ్యలు చేశారు.
నటి అర్చన గౌతమ్ తన ట్విట్టర్‌లో దృశ్యాలు పోస్ట్ చేసిన కొద్దిసేపటి తర్వాత దానికి భిన్నమైన దృశ్యాలు మరికొన్ని సామాజిక మాద్యమాలలో వైరలయ్యాయి.
‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హసీనా పార్కర్’, ‘బారాత్ కంపెనీ’ తదితర హిందీ చిత్రాల్లో నటించిన అర్చన తెలుగులో ‘ఐపీఎల్: ఇట్స్ ప్యూర్ లవ్’ అనే సినిమా చేశారు. పలు దారావాహికలు, వీడియో సాంగ్స్‌లోనూ ఆమె మెరిశారు. మోడల్ అయిన అర్చన 2018లో ‘మిస్ బికినీ ఇండియా’ టైటిల్ గెలుచుకున్నారు. ఈ ఏడాది జరిగిన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మేరఠ్‌లోని హస్తినాపుర్ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
తమ ఉద్యోగిపై దాడి చేశారు..: తితిదే
తమ ఉద్యోగిపై ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నటి అర్చనా గౌతమ్ దాడి చేయడం హేయమైన చర్యని తితిదే సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివకాంత్ తివారీ, నటి అర్చనా గౌతమ్‌తోపాటు మరో ఏడుగురు ఆగస్టు 31న శ్రీవారి దర్శనం కోసం కేంద్ర సహాయ మంత్రి నుంచి సిఫార్సు లేఖను తీసుకుని తిరుమలకు వచ్చారు. అదనపు ఈవో కార్యాలయంలో దర్శనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ లేఖపై రూ.300 దర్శన టికెట్లు మంజూరు చేస్తూ శివకాంత్ తివారీకి చెందిన సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపాం. అయితే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. అనంతరం శివకాంత్ తివారీ అదనపు ఈవో కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే టికెట్లు తీసుకోవాల్సిన గడువు ముగిసిందని సిబ్బంది తెలిపారు. ఆయనతోపాటు అదనపు ఈవో కార్యాలయంలోకి వచ్చిన నటి అర్చనా గౌతమ్ కార్యాలయ సిబ్బందిని దుర్భాషలాడారు. సర్ది చెప్పబోయిన ఒక ఉద్యోగిపై చేయిచేసుకున్నారు.
చివరకు సిబ్బంది వారి వివరాలను తీసుకుని రెండోసారి రూ.300 టికెట్లు కేటాయించినా తీసుకోవడానికి నటి నిరాకరించారు. అనంతరం అక్కడి నుంచి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కార్యాలయ ఉద్యోగులు తనపై చేయి చేసుకుని దురుసుగా ప్రవర్తించారని తప్పుడు ఫిర్యాదు చేశారు. సిబ్బంది తీసిన వీడియోను సీఐకి చూపగా నటి దురుసుగా ప్రవర్తించిన విషయం వెలుగు చూసింది. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నెల 1న వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ కావాలంటే రూ.10,500 చెల్లించి శ్రీవాణి దర్శన టికెట్ మాత్రమే పొందాలని సిబ్బంది సలహా ఇచ్చారు. వాస్తవాలు ఇలా ఉండగా అదనపు ఈవో కార్యాలయ ఉద్యోగులు దర్శన టికెట్ కోసం రూ.10 వేలు డిమాండు చేశారని సదరు వీడియోలో నటి ఆరోపించారు. భక్తులు ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దు’ అని తితిదే విజ్ఞప్తి చేసింది.
ఇవీ చదవండి: