TTD EO ON GHAT ROAD WORKS: వర్షాల ధాటికి కొండచరియలు విరిగి పడి దెబ్బతిన్న.. తిరుమల ఘాట్ రోడ్డును తితిదే ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. రాళ్లు పడడం వల్ల నాలుగు ప్రాంతాల్లో రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లాయని ఆయన తెలిపారు. బండరాళ్లు పడిన సమయంలో ఘాట్ రోడ్డులో వాహనాలు వస్తున్నాయని.. దేవుడి దయతో భక్తులకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదని చెప్పారు.
ఈ ఘటనను దేవుడు ఇచ్చిన హెచ్చరికగా తీసుకుని.. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ లో రాళ్లు పడకుండా ఉండేందుకు ఘాట్ రోడ్డులో నిపుణులు సర్వే నిర్వహిస్తున్నారని.. వారి సూచనలతో కొండచరియలు పడే ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపడతామని అన్నారు. ధ్వంసమైన రోడ్డును.. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పనులు పూర్తయ్యే వరకూ లింక్ రోడ్డు ద్వారా వాహనాలను అనుమతిస్తామన్నారు.
అఫ్కాన్ సంస్థకు బాధ్యతలు..
కొండ చరియలు విరిగి పడిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు పూర్తి చేసే విషయంపై ఐఐటీ నిపుణులు, ఇంజినీరింగ్ అధికారులతో తితిదే ఛైర్మన్ శుక్రవారం సమావేశం నిర్వహించారని చెప్పారు. పునరుద్ధరణ పనులు పూర్తి చేసేందుకు ఒక నెల సమయం పడుతుందని నిపుణులు సూచించారని, ఇందుకోసం ఎంతో నైపుణ్యం ఉన్న ఆఫ్కాన్ సంస్థకు బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు.
ఆఫ్కాన్ సంస్థ నిపుణుల బృందం 20 రోజుల్లో డిజైన్ సిద్ధం చేయాలని కోరామని, మరో నిపుణుల బృందం ఘాట్ రోడ్డులో అన్ని బండరాళ్లను పరిశీలించి సర్వే చేసి, మరింత బలంగా మార్చేందుకు పనులు చేపట్టాలని సూచించామని తెలిపారు. ఈ మొత్తం పనులు 25 రోజుల్లో పూర్తవుతాయన్నారు. అదనపు ఈవో వెంట సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, దిల్లీ ఐఐటి నిపుణులు కె.ఎస్.రావు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఆఫ్కాన్ సంస్థ ఇంజినీరింగ్ నిపుణులు ఉన్నారు.
ఇదీ చదవండి: