తిరుమల వేంకటేశ్వరస్వామి వైభవాన్ని, హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఒక ఆయుధం లాంటిదని తితిదే ఈవో జవహర్‌రెడ్డి (TTD EO) అన్నారు. ఎస్వీబీసీ (SVBC) కార్యాలయంలో నిర్వహించిన ఛానల్ 13వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ ప్రజల ఆరోగ్యం కోసం శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తూ తితిదే నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయటం ద్వారా శ్రీనివాసుని వైభవం ప్రజలకు చేరువైందన్నారు. తరిగొండ వెంగమాంబ సాహిత్యం ప్రజలకు చేరవేయటంలో ఎస్వీబీసీ పాత్ర కీలకమని చెప్పారు.
వేదాలు, పురాణాలు, సంస్కృతం, గోసంరక్షణ, సేంద్రియ వ్యవసాయం వంటి అంశాలను ప్రజలకు వివరించేలా కార్యక్రమాలను రూపొందించాలని ఛానల్ నిర్వహకులకు సూచించారు. చిన్నారులు తెలుగు నేర్చుకోవడానికి, పురాణాల్లో పాత్రల గురించి తెలుసుకోవడానికి, ఇతిహాసాల గురించి అవగాహన పెంచుకోవడానికి మాస వైశిష్ట్య కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రసారం చేయటం ద్వారా హిందూ ధర్మప్రచారాన్ని ప్రజలకు మరింత చేరువ చేయవచ్చని ఈవో అభిప్రాయపడ్డారు. ఎస్వీబీసీ హిందీ, కన్నడ ఛానళ్లను త్వరలో ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఛానల్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్వీబీసీ ఛైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర, జేఈవో సదా భార్గవి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
CM Letter To PM: 'తెలంగాణ అక్రమ నీటి వాడకంపై చర్యలు తీసుకోండి'