వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గాయకులు, స్వరకర్తలతో తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తిరుమల అన్నమయ్య భవన్లో సమావేశం నిర్వహించారు. అన్నమాచార్యులు రాసిన 32 వేల సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం 14 వేల కీర్తనలు అన్నమాచార్య ప్రాజెక్టు వద్ద ఉండగా...వీటిలో ఇప్పటి వరకు 4 వేల కీర్తనలు స్వరపరిచారు. ఆ నాలుగు వేలతో పాటు మిగిలిన 10 వేల కీర్తనలను కూడా ప్రతి పదానికి అర్థం, తాత్పర్యంతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ధర్మారెడ్డి సూచించారు. గాయకులు కీర్తనలోని ప్రతి పదానికి అర్థం, ఆ కీర్తన రాసిన సందర్భం తెలుసుకొని పాడితేనే అద్భుతమైన ఆవిష్కరణ జరుగుతుందన్నారు.
సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా స్వరపరుస్తున్న ఈ కీర్తనలను తితిదే వెబ్సైట్, ఎస్వీబీసీ యూట్యూబ్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే ఏర్పాట్లు చేస్తామన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఒక స్వరకర్తకు 8 నుంచి 10 కీర్తనలు ఇచ్చి వాటిని స్వరపరిచే బాధ్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కన్యాకుమారి,సుధాకర్, వీరభద్ర రావు, ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విభీషణ శర్మ, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ దక్షిణా మూర్తితో పాటు పలువురు గాయకులు, సంగీత దర్శకులు పాల్గొన్నారు.
ఇదీచదవండి