నగరాలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న తిరుపతి నగరం..ఆ దిశగా ఎంతమేర అడుగులు వేసిందన్న ప్రశ్నలు ఉపఎన్నికల వేళ గట్టిగా వినిపిస్తున్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకే తలమానికంగా తిరునగరిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తున్నట్లు భాజపా నాయకులు చెబుతుంటే..ప్రగతి పనులు ఎక్కడని వైకాపా సహా తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 18వందల కోట్ల విలువైన పనులు జరగాల్సి ఉండగా...చాలావరకూ శంకుస్థాపనలకే పరిమితమయ్యాయని ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి.
స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా తిరుపతిలో ఇప్పటిదాకా రూ. 146 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. అందులో బయో మిథనైజేషన్ ప్లాంట్, స్మార్ట్ డంపింగ్ యార్డ్, నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్, నగరపాలక సంస్థలో అత్యాధునిక సాంకేతికత, రోడ్ల పక్కనున్న గోడలను సుందరీకరించడం లాంటివి ఉన్నాయి. 14 వందల 33 కోట్ల విలువైన 32 ప్రాజెక్టుల పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉండగా...రూ.224 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన మరో 7 ప్రాజెక్టులు టెండర్ దశ కూడా దాటలేదు. గరుడ వారధి, భూగర్భ విద్యుత్ కేబులింగ్, ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ప్రాజెక్టులు...పెండిగ్‌లోనే ఉండిపోయాయి. ఇదే విషయాన్ని ప్రజలకు వివరిస్తున్న ప్రతిపక్షాలు..కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
కాషాయ దళం మాత్రం..తిరుపతి స్మార్ట్ సిటీకి పెద్దఎత్తున నిధులు కేటాయించామని చెబుతోంది. కేంద్ర నిధులను స్థానిక నాయకులే పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తోంది. తమను గెలిపిస్తే...స్మార్ట్ సిటీ అంటే ఏమిటో చేసి చూపుతామని నేతలు అంటున్నారు. లోక్‌సభ ఉపఎన్నికల పుణ్యమా అని...తిరుపతి స్మార్ట్ సిటీ అంశంపై జరుగుతున్న చర్చ మంచిదేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఇదీచదవండి