తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి పది రోజుల పాటు అనుమతించే అంశంపై... తితిదే తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ రెండు రోజుల పాటు ఉత్తర ద్వారాన్ని తెరచి దర్శనానికి అనుమతించినా.... పూర్తి స్థాయిలో భక్తులకు దర్శనం లభించడం లేదు. భక్తుల సౌకర్యం కోసం ఉత్తర ద్వారాన్ని పది రోజుల పాటు తెరచి ఉంచాలని ధర్మకర్తల మండలి భావించింది. అక్టోబర్ 23న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఆగమ సలహా మండలి అభిప్రాయం మేరకు భక్తులకు ఉత్తర ద్వార ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు.
శ్రీరంగం తరహాలో
తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో.... ఏకాదశి మొదలు పది రోజుల పాటు ఉత్తర ద్వార ప్రవేశం కల్పిస్తున్నారు. ఇదే తరహా విధానాన్ని తిరుమలలోనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఆగమ సలహా మండలి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని పది రోజుల పాటు ఉత్తర ద్వారాన్ని తెరచి ఉంచే అంశంపై చర్యలు తీసుకోనున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
డిసెంబర్‌లో తుది నిర్ణయం
తితిదే ధర్మకర్తల మండలి ప్రతిపాదనల మేరకు ఆగమ సలహా మండలి ఉత్తర ద్వారాన్ని పది రోజుల పాటు తెరచి ఉంచే అంశంపై చర్చించింది. ఆగమ సలహా మండలి ఛైర్మన్ అనంతశయన దీక్షితులు, ఆగమ సలహా సభ్యుడు రమణ దీక్షితులు, ఇతర సభ్యులు ధర్మకర్తల మండలి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై డిసెంబర్‌లో జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
హిందూ ధార్మిక సంస్థల ఆందోళన
వైకుంఠ ద్వారాన్ని పది రోజుల పాటు తెరచి ఉంచాలన్న నిర్ణయాన్ని హిందూ ధార్మిక సంస్థలు తప్పుపడుతున్నాయి. తితిదే పాలక మండలి చర్యలు తిరుమల ఆలయ విశిష్ఠతను దెబ్బతీసేలా ఉన్నాయని భాజపా నేతలు ఆరోపించారు. తిరుమలలో అనాదిగా వస్తున్న సంప్రదాయాలను మండలి నిర్ణయాలు కాలరాస్తున్నాయని హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ఇదీ చదవండి :