రాయలసీమలో ఆరోగ్య వరప్రదాయనిగా పేరుగాంచిన తిరుపతి స్విమ్స్ నిధుల కొరతతో సతమతమవుతోంది. స్విమ్స్ ద్వారా 14 సూపర్ స్పెషాలిటీతో పాటు 40 విభాగాల్లో పేద రోగులకు ఆధునిక వైద్యసేవలు అందుతున్నాయి. రోజుకు సగటున దాదాపు రెండు వేల మంది వరకు ఓపీ, 850 ఐపీ సేవలతో అత్యంత రద్దీగా ఉండే స్విమ్స్ ఇపుడు కరోనా వైద్య సేవలకే పరిమితమైంది. కరోనాకు ముందు స్విమ్స్ ఆసుపత్రికి వివిధ విభాగాల సేవలతో నెలకు మూడు కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరేది. వైద్యసేవలు, శస్త్రచికిత్స ద్వారా ఆరోగ్యశ్రీ కింద మరో నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. రెండు ఆసుపత్రులను కరోనా రోగుల సేవలకు కేటాయించడంతో ఓపీ, ఐపీతో పాటు సూపర్ స్పెషాలిటీ సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా ఆదాయ మార్గాలను స్విమ్స్ కోల్పోయింది.
గ్రాంటుపైనే ఆధారం
మార్చి నెలలో కరోనా మొదలవగా ఏప్రిల్‌లో పద్మావతి ఆసుపత్రిని రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రిగా ప్రకటించారు. పద్మావతి మహిళా వైద్యకళాశాల ఆసుపత్రికి రాయలసీమ జిల్లాలలోని కరోనా రోగుల సంఖ్య పెరగడం అక్కడ ఉన్న బెడ్లు సరిపోకపోవటంతో స్విమ్స్ ఆసుపత్రిని కరోనా ఆసుపత్రిగా మార్చారు. స్విమ్స్‌లో జులై 14 నుంచి ఓపీ, ఐపీ సేవలు నిలిపివేశారు. దీనివల్ల ప్రతి నెలా రెవెన్యూ గ్రాంటు కింద తితిదే కేటాయించే మూడు కోట్ల రూపాయలపైనే ఆసుపత్రి ఆధారపడుతోంది. గడచిన మూడు నెలలుగా సీనియర్ వైద్యులకు సగం జీతాలను మాత్రమే చెల్లిస్తున్నారు.
అందుకే ఆదాయం తగ్గింది
గతంలో తితిదే కేటాయించే నిధులతో పాటు రోగులకు వివిధ విభాగాల ద్వారా సేవలందిస్తూ ఆదాయం సమకూర్చుకొనే వాళ్లమని స్విమ్స్ సంచాలకులు డాక్టర్ వెంగమ్మ తెలిపారు. కరోనా ప్రారంభం నుంచి ఇతర వైద్య సేవలు దాదాపుగా నిలిపివేయటంతో ఆదాయం తగ్గిపోయిందని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా వైద్య సేవలపై ఆ ప్రభావం లేకుండా ప్రయత్నిస్తున్నామన్నారు.
స్విమ్స్‌లో దాదాపు రెండు నెలల తర్వాత సెప్టెంబర్ 14 నుంచి అత్యవసర కేసుల ఓపీ సేవలు ప్రారంభించారు. కరోనాకు ముందు 40 విభాగాల్లో సేవలు అందుతుండగా ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ విభాగంలోని 14 విభాగాల్లో మాత్రమే ఓపీ సేవలు పునరుద్ధరించారు.