తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ- స్విమ్స్.. స్టేట్ కొవిడ్ ఆసుపత్రుల్లో ఒకటిగా కరోనా సేవలను విస్తృతస్థాయిలో అందిస్తోంది. స్విమ్స్‌లోని శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాల మొత్తం కొవిడ్ ఆసుపత్రి కాగా.. అందులో 145ఐసీయూ, 328 ఆక్సిజన్ పడకలున్నాయి. వీటిలో 40 వెంటిలేటర్ల ద్వారా చిత్తూరు జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి పెద్దఎత్తున రోగులు వచ్చి కరోనాకు చికిత్స పొందుతున్నారు.
ఒక్క చిత్తూరు జిల్లాలోనే రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో.. రుయాతో పాటు స్విమ్స్‌పై విపరీతమైన భారం పడుతోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న పది ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలలు, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా మిగిలిన వాటిని రద్దు చేసి కరోనా రోగుల కోసం సేవలందిస్తున్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే.. స్విమ్స్ ఆసుపత్రిలో మాత్రం డయాలసిస్ సేవలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి.
మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ చికిత్స తప్పనిసరి. వారంలో కనీసం మూడు రోజులు రక్తంలోని మలినాలను శుద్ధి చేసుకోవాలి. కరోనా విపత్కాలంలో జిల్లావ్యాప్తంగా ఉన్న డయాలసిస్ కేంద్రాలు చాలా వరకూ సేవలను అందించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అయినప్పటికీ స్విమ్స్ ఆసుపత్రిలో నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక విభాగాల ద్వారా రోగులు డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. అందుబాటులో ఉన్న 125 డయాలసిస్ యూనిట్ల ద్వారా రోజుకు 300మంది చొప్పున.. రోజు విడిచి రోజు మొత్తం 600మంది రోగులకు ఇక్కడి వైద్యులు డయాలసిస్ సేవలు అందిస్తున్నారు.
గతేడాది కరోనా సమయంలోనూ నిరాటంకంగా పనిచేస్తూ.. 91 వేల 169 డయాలసిస్ పరీక్షలను స్విమ్స్ ఆసుపత్రుల వైద్యులు నిర్వహించగా... అందులో 500మందికి పైగా కరోనాతో బాధపడుతున్న రోగులు ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 16వేల 313 డయాలసిస్ పరీక్షలను నిర్వహించినట్లు వైద్యులు చెబుతున్నారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చేవారికీ వైద్యం అందిస్తున్నారు.
ఇదీ చదవండి: