తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన స్విమ్స్ 28వ వార్షికోత్సవ వేడుకల్లో ఈవో జవహర్ రెడ్డితో కలిసి తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రిగా స్విమ్స్ వైద్య సిబ్బంది అందించిన సేవలు మరవలేనివని ఆయన అన్నారు.
కరోనా సమయంలో వైద్య సేవలందించడానికి తితిదే దాదాపు 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని ఆయన అన్నారు. సమావేశంలో పాల్గొన్న ఈవో మాట్లాడుతూ వైఎస్సార్ హెల్త్ క్లీనిక్ ల ద్వారా 53 రకాల పరీక్షలతో పాటు వైద్య సేవలు అందించడం ద్వారా పేదలకు మెరుగైన ఆరోగ్యం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల హెల్త్ క్లీనిక్ లు గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే తొలిసారని ఈవో అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని ఇప్పటికే నాలుగు కళాశాలలు నిర్మాణదశలో ఉన్నాయన్నారు. రానున్న కాలంలో వైద్య విద్య పూర్తి చేసిన వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలున్నాయని అన్నారు. వార్షికోత్సవ వేడుకల్లో ఎస్వీయూ ఉపకులపతి రాజారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తిరుపతి లోక్సభ స్థానంపైనే అందరి గురి..!