తితిదే ఆలయాల్లో స్వామి, అమ్మవార్ల కైంకర్యాలకు ఉపయోగించిన పుష్పాలతో సప్తగిరులకు సూచికగా ఏడు బ్రాండ్లతో తితిదే చేపట్టిన పరిమళ భరిత అగరబత్తీలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆలయాల్లో పూజలు, అలంకరణలకు వినియోగించే పుష్పాలు వృథా కాకుండా బెంగుళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో తితిదే అగరబత్తుల తయారీ చేపట్టింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర గోశాలలో పది యంత్రాల ద్వారా రోజుకు 3.50 లక్షల అగరబత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. స్వామి, అమ్మవార్లకు వినియోగించిన పుష్పాలతో చేపట్టిన అగరబత్తీలను లాభాపేక్ష లేకుండా ఉత్పత్తి వ్యయానికే విక్రయిస్తున్నారు. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, తుష్టి, దివ్యసృష్టి, దివ్యదృష్టి పేర్లతో ఏడు రకాల అగరబత్తీలను ఉత్పత్తి చేస్తున్నారు.
ప్రాథమిక దశలో రోజుకు ఐదు వందల కిలోల పుష్పాలతో అగరబత్తీల తయారీ చేపట్టిన తితిదే భక్తుల నుంచి డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి మరింత పెంచింది. గతంలో రోజుకు పదివేల పాకెట్లను తయారు చేస్తుండగా భక్తుల నుంచి స్పందన అధికంగా ఉండటంతో పదిహేను వేల పాకెట్లను తయారు చేస్తున్నట్లు తితిదే ఈఓ జవహర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తిరుమల లడ్డు విక్రయ కేంద్రాల్లో మాత్రమే ఈ అగరుబత్తీలను విక్రయిస్తున్నామని, ఇతర ప్రాంతాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
" సెప్టెంబర్ 13న తిరుమల-తిరుపతుల్లోని తితిదే అనుబంధ దేవాలయాల్లో పూజకు వినియోగించిన పూలతో అగరుబత్తీలను తయారు చేయడం ప్రారంభించాం. రోజుకు 500-600కేజీల పూలతో సుమారు 5వేల పాకెట్లు తయారు చేస్తున్నాం. తిరుమలలోని లడ్డూ కౌంటర్ పక్కనే విక్రయిస్తున్నాం. అయితే భక్తుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ అగరుబత్తీలు త్వరగా విక్రయమవుతున్నాయి. భక్తుల డిమాండ్ ను అనుగుణంగా మరిన్ని యంత్రాలను తెప్పించి ఉత్పత్తిని పెంచే ఆలోచనలో ఉన్నాం. " -జవహర్‌రెడ్డి, ఈఓ, తితిదే.
తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉన్న తితిదే పరిధిలోని ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో అగరబత్తీలను తయారు చేస్తున్న తితిదే ఆగమ పండితుల అనుమతి మేరకు శ్రీవారికి వినియోగించిన పుష్పాలను అగరబత్తీలకు వినియోగించనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: SZC Meeting: రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదు: సీఎం జగన్