తిరుపతి బస్టాండ్ నుంచి తిరుమల వెళ్లే దారిలో.. 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ప్రకాశం పార్కు.. స్మార్ట్ సిటీ వెలుగులను సంతరించుకుంది. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా తిరుపతి నగరానికి విడుదలైన నిధులు.. ఉద్యానవనం అభివృద్ధికి ఉపయుక్తమయ్యాయి.
పార్కులో అడుగు పెట్టిన దగ్గర నుంచి కనిపించే ప్రతి విభాగాన్ని అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్-తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. సరికొత్త రూపుతో ప్రకాశం పార్కు అందరినీ ఆకర్షిస్తోంది.
నడక కోసం ఏర్పాటు చేసిన అతిపెద్ద వాకింగ్ ట్రాక్.. వాకర్స్ కి సరికొత్త అనుభూతిని అందిస్తోంది. దాదాపు 300మంది ఒక్కసారే యోగా, ధ్యానం చేసుకునేలా నిర్మించిన యాంఫీ ధియేటర్ పార్కులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ జిమ్‌ను నగర వాసులు వినియోగించుకుంటున్నారు. శ్రీవారి భక్తిగీతాలు, సంకీర్తనలు ఉద్యానవనంలో వినిపించేలా చేసిన ఏర్పాట్లు ప్రశంసలందుకుంటున్నాయి. చిన్నారుల ఆటపాటలకు స్వర్గదామంలా ప్రకాశం పార్కును అధికారులు తీర్చిదిద్దారు. బెలూన్ పార్క్, షటిల్ కోర్టులు, స్కేటింగ్ గ్రౌండ్ లు పిల్లలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. భవిష్యత్‌లో చిన్నారుల కోసం ఓ చిన్నపాటి కొలను ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు.
ఇదీ చదవండి: పోతిరెడ్డి సహా ఇతర ప్రాజెక్టులు ఆపకపోతే.. మేం ఆనకట్ట నిర్మిస్తాం: కేసీఆర్