ముఖంలో హావభావాలు, చేతులను చాచుతూ చేసే విన్యాసాలు, అందెల రవళితో కథలను చెప్పే అద్భుతమైన నాట్య ప్రక్రియ కథక్. ఈ నృత్యరీతిని..తెలుగు రాష్ట్రాల్లో బోధించే వారు చాలా తక్కువ. అలాంటిది ఈ నృత్యం కోసం తనకున్న ఉన్నత ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు ధర్మవరం శ్రీదేవి. తిరుపతికి చెందిన ఈ నాట్యగురువు గడిచిన పదకొండు సంవత్సరాలుగా మెరికల్లాంటి కథక్ కళాకారులను తీర్చిదిద్దే సంకల్పంలో నిమగ్నమయ్యారు. డాక్టర్ డిక్కీస్ అకాడమీ ఆఫ్ డ్యాన్య్ పేరుతో ఓ నాట్యశాలను ప్రారంభించి...ఉచితంగా కథక్, భరతనాట్యం, జానపద కళల్లో శిక్షణ అందిస్తున్నారు.
శ్రీదేవి తండ్రి డాక్టర్ కృష్ణమూర్తి, చిన్నాన్న లోకాభిరామ్ కళారంగానికి చెందినవారు కావడం వల్ల..ఆమెకు కూడా చిన్నతనం నుంచే నాట్యంపై ఆసక్తి పెరిగింది. 3 సంవత్సరాల వయస్సు నుంచే నాట్యం నేర్చుకోవడం ప్రారంభించి...16 సంవత్సరాల్లో కథక్, భరతనాట్యంలో పూర్తి స్థాయి నాట్యకారిణిగా రాణించి దేశవిదేశాల్లో ప్రదర్శనలిచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సంపాదించి 20 సంవత్సరాల పాటు ఉద్యోగంతో పాటు..నాట్యాన్ని కొనసాగించారు. ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం వల్ల...రాజీనామా చేసి తను నమ్ముకున్న కళకోసం పనిచేస్తున్నారు.
తనకు తెలిసిన విద్యను పది మందికి పంచాలనే ఆశతో..డిక్కీస్ అకాడమీ ఆఫ్ డ్యాన్స్‌తో సేవలు ప్రారంభించింది. మొదట ఒకరితో మొదలై ప్రస్తుతం 58 మంది శిష్యులు ఆమె దగ్గర నృత్యం నేర్చుకుంటున్నారు. నాట్యంలో తను అందించిన సేవలకు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా విదేశాల్లో ఉన్న విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. అమెరికాలో డ్యాన్స్ స్కూల్‌ను స్థాపించే దిశగా కృషి చేస్తున్నట్లు శ్రీదేవి చెబుతున్నారు.