సూర్యజయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు తితిదే విసృత ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు... ఏడు వాహన సేవలపై తిరువీధుల్లో ఊరేగుతూ స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారి సూర్యప్రభవాహన సేవతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం చిన శేష, గరుడ, హనుమంత వాహనాలపై మలయప్పస్వామి భక్తులను కటాక్షిస్తారు. మధ్యాహ్నం రెండు నుంచి 3 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై శ్రీవారు ఉభయ దేవేరులతో కలసి తిరువీధుల్లో విహరిస్తారు.
రథసప్తమి పర్వదినాన ఒకే రోజు ఏడు వాహన సేవలను దర్శించుకోవడంతో పాటు చక్రస్నానంలో పాల్గొనే అవకాశం ఉండడం వల్ల... ఏటా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా... అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారు విహరించే నాలుగు తిరుమాఢ వీధుల్లో గ్యాలరీలు ఏర్పాటు చేశారు. గ్యాలరీలలోని భక్తులకు అన్నప్రసాదాలను, తాగునీటిని నిరంతరం సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలతో భద్రతను నిరంతరం పర్యవేక్షించేలా కమాండ్ కంట్రోల్ రూమ్ సిద్ధం చేశారు. రథసప్తమి పురస్కరించుకుని శనివారం నాడు అన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది.
ఇదీ చదవండి: సరస్వతీ దేవిగా.. దుర్గమ్మ దర్శనం