తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచార హోరులో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పదునైన విమర్శలతో కత్తులు దూస్తున్నారు. ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థుల పక్షాన ప్రచారాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉప ఎన్నిక ప్రచారపర్వం వేడెక్కింది. ఆధికార వైకాపాతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలు, ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రచారాల్లో మందిరాలు ధ్వంసం, మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యకేసు, తితిదే వైఫల్యాలు, ప్రత్యేకించి ఓ సామాజిక వర్గంపై వేధింపులు తదితరాలు ప్రస్తావనకు వచ్చాయి. పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడంతో మరింతగా ఘాటెక్కింది.
వైకాపాలో మంత్రులకే బాధ్యతలు
వైకాపా అభ్యర్థి గురుమూర్తి గెలుపే లక్ష్యంగా రాయలసీమ జిల్లాల పార్టీ ఇన్‌ఛార్జి వై.వి.సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్‌రెడ్డి, కొడాలి నాని, పేర్నినాని, ఆదిమూలపు సురేష్, కన్నబాబు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రచారానికి ముఖ్యమంత్రి జగన్ వచ్చే అవకాశాల్లేవని నేతలు చెపుతున్నారు. సుబ్బారెడ్డితో పాటు మంత్రులు గెలుపు బాధ్యతలు తమ భుజాల మీద వేసుకున్నారు. వీరంతా క్షేత్ర స్థాయిలో ఉంటూ కార్యాలు సరిపెడుతున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటున్నారు. రానున్న ఒకట్రెండు రోజుల్లో మరింతగా ప్రచారాన్ని ఉద్ధృతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తెదేపా రాష్ట్ర నేతల మకాం
తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శులు నారా లోకేశ్, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, అమరనాథరెడ్డి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో రాష్ట్రంలోని పలువురు యువ నేతలు రంగంలోకి దిగారు. తెదేపా అధినేత చంద్రబాబు కూడా ప్రచారానికి వచ్చే అవకాశాల్లేవని, నేతలకు మాత్రం నిత్యం దిశానిర్దేశం చేస్తున్నారని పార్టీ కీలక నేతలు చెపుతున్నారు. ఉప ఎన్నికలో అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనే విషయంలో మంగళవారం కీలక సమావేశం జరగనున్నట్లు తెలిసింది. అచ్చెన్నాయుడు, నారా లోకేశ్ మరి కొన్ని రోజలు ఇక్కడ మకాం పెట్టి నేతలను సమన్వయం చేయనున్నారని సమాచారం. తిరుపతిలో సోమవారం లోకేశ్ ప్రచారం నిర్వహించనున్నారు.
పవన్ సమర శంఖారావం
భాజపా అభ్యర్థి రత్నప్రభ తరఫున జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం తిరుపతిలో సమర శంఖారావం పూరించారు. పదునైన విమర్శలతో అధికార వైకాపాపై దుమ్మెత్తి పోశారు. జనసేన నేతలతో ప్రత్యేక సమావేశమై గెలుపు బాధ్యతలు అప్పగించారు. ఇరుపార్టీల మధ్య సమన్వయానికి పలు సూచనలు చేశారు. భాజపా రాష్ట్ర నేతలందరూ తిరుపతిలోనే గత కొన్ని రోజులుగా మకాం వేశారు. తెలంగాణ నుంచి నేతలను ప్రచారానికి రప్పించారు. మేధావుల పేరిట ప్రత్యేక సదస్సులు పెట్టి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రత్యేక ఒరవడి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే తన పంథాలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఒంటరిగానే ఇంటింటి ప్రచారం చేస్తూ హంగూ అర్భాటం లేకుండా ప్రజల్లో స్థానం సంపాదించుకోవడానికి కృషి చేస్తున్నారు. నిర్మాణాత్మక విమర్శలతో ఓటర్లలో ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర నేతలు రంగంలోకి దిగారు.
సీపీఎం పదునైన విమర్శలు
సీపీఎం కూడా ఎన్నికల్లో తలపడుతూ వైకాపా, భాజపా లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లోకి వెళుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కీలక నేతలు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
ఇదీ చదవండి