Under bridge at Rayalacheruvu Railway gate: ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు రెండేళ్ల క్రితం తిరుపతిలోని రాయలచెరువు రైల్వేగేటు వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం చేప్టటారు. స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా రైల్వేశాఖతో పాటు తిరుపతి నగర పాలక సంస్థ సంయుక్తంగా 15కోట్ల 30 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించారు. రెండున్నర మీటర్ల ఎత్తు, 12 మీటర్ల వెడల్పుతో చిన్నపాటి అండర్ పాస్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక చేశారు. 4 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా.. రెండు సంవత్సరాలు దాటినా ఆ పనులు ముందుకు సాగడం లేదు.
వంతెన నిర్మాణం కోసం రైల్వే గేటు మూసివేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. పట్టాలకు అవతల వైపున్న ప్రాంతానికి వెళ్లాలంటే కిలోమీటర్లు తిరగాల్సి వస్తోందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. మారుతీ నగర్, ఎంఆర్ పల్లి, బైరాగిపట్టెడ, అన్నమయ్య సర్కిల్ ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు బాలాజీ కాలనీ కూడలి మీదుగా వెళ్లాల్సివస్తోంది. రైల్వే గేటుకు సమీపంలోనే ఉన్న రైతు బజారు వెళ్లాలంటే కిలోమీటర్ల తిరిగి రావాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. అండర్‌బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం కారణంగా రాయలచెరువు, కర్ణాల వీధి, గాంధీరోడ్డు ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ, నగరపాలక సంస్థల మధ్య సమన్వయ లోపం కారణంగా రాయలచెరువు గేటు అండర్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యమవుతోందని స్థానికులు అంటున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: