IIT Expects Visit Tirumala Ghat Road: తిరుమల కనుమదారిని ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. దిల్లీ ఐఐటీ ఫ్రొఫెసర్ కేఎస్.రావు, చెన్నై ఐఐటీ ప్రొఫెసర్ ప్రసాద్, తితిదే పూర్వ చీఫ్ ఇంజినీర్, తితిదే సాంకేతిక సలహాదారు రామచంద్రరెడ్డి కలిసి... అలిపిరి నుంచి ఎగువ ఘాట్ రోడ్డును పరిశీలించారు. బాష్యకారుల సన్నిధి వద్ద గల కొండపై నుంచి పెద్ద బండరాళ్లు పడిన ప్రాంతాన్ని డ్రోన్ కెమెరా ద్వారా పరీక్షించారు. నవంబర్ 18న భారీ వరదలతో దెబ్బతిన్న రోడ్లు, కొట్టుకుపోయిన రక్షణ గోడలు, కల్వర్టుల వద్ద పర్యటించారు.
సాంకేతిక వినియోగంతో...
అధిక వర్షపాతం, వరదల కారణంగా ప్రమాదం జరిగిందని... విరిగిపడిన బండరాళ్ళు 30 నుండి 40 టన్నులు ఉంటాయని దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ కె.ఎస్.రావు తెలిపారు. ఇవి చాలా ఎత్తు నుండి పడటం వలన రోడ్లు, రక్షణ గోడలు దెబ్బతిన్నాయన్నారు. ఎగువ ఘాట్ రోడ్డులో మరో పన్నెండు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని గుర్తించామన్నారు. కొండచరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో తితిదేకు సమగ్ర నివేదిక అందిచనున్నట్లు తెలియజేశారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించి... దెబ్బతిన్న రహదారిని మరమ్మతులు చేయవచ్చని తెలిపారు. ఇందుకు మూడు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. శేషాచల కొండల్లో, ఘాట్ రోడ్లలో వర్షపు నీరు నిలువకుండా అదనపు కాలువలు ఏర్పాటు చేయాలని సూచించారు.
లింక్ రోడ్డు వరకు అందుబాటులోకి...
IIT Expects Visit Tirumala Ghat Road: ప్రస్తుతానికి అక్కడక్కడ మరమ్మత్తులు చేసి లింక్ రోడ్డు వరకు ఎగువ ఘాట్ రోడ్డును అందుబాటులోని తేవచ్చని తితిదే పూర్వ చీఫ్ ఇంజినీర్, తితిదే సాంకేతిక సలహాదారు రామచంద్రరెడ్డి తెలిపారు. లింక్ రోడ్డు వరకు వచ్చిన వాహనాలను మోకాళ్ళ మెట్టు చేరుకుని అక్కడి నుంచి దిగువ ఘాట్ రోడ్డు ద్వారా తిరుమలకు చేరుకునేలా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. లింకు రోడ్డుకు ఎగువన ఉన్న రోడ్డు ఎత్తైన కొండలతో రహదారి ఉందని, ఈ ప్రాంతంలో రాళ్లు పడేలా కొండబాగం ఉందన్నారు. అందుకు లింకు రోడ్డు నుంచి మరో మార్గం నిర్మించాలని గతంలోనే తితిదేకు సూచించామని ఇప్పుడు నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
దిగువ ఘాట్ రోడ్ ద్వారానే అనుమతి...
రహదారిపై పడిన భారీ బండరాళ్లను తొలగించే పనులను వేగవంతం చేశారు. ఈ రాళ్లను తొలగిస్తే లింకు రోడ్డు వరకు ఎగువ ఘాట్ రోడ్డు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో భక్తుల ప్రయాణ సమయాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని అధికారులు బావిస్తున్నారు. ప్రస్తుతం దిగువ ఘాట్ రోడ్డు ద్వారానే విడతల వారీగా వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో కొండపైకి చేరుకోవాలన్నా దిగువకు రావాలన్నా మూడు గంటల సమయం పడుతోంది.
ఇదీ చదవండి..