తిరుపతిలోని హథీరాంబాబా మఠంలో విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డు బసవరాజు ఆత్మహత్యకు యత్నించాడు. మహంతు కార్యాలయానికి సమీపంలోని స్నానాలగదిలోకి వెళ్లి.. బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. నేనే తప్పు చేయలేదు, డాలర్‌తో నాకు సంబంధం లేదంటూ బసవరాజు కాగితంపై రాశాడు. అతడు ఆత్మహత్యకు యత్నించడానికి మహంతుతో పాటు మరో ముగ్గురు కారణమంటూ.. బాధితుడు రాసిన ఓ చిత్తు కాగితాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బంగారు నగలు బ్యాంకులో తనఖా పెట్టి బసవరాజు అప్పు తెచ్చుకున్నాడని తెలిసిందని.. హథీరాంబాబా మఠం మహంతు అర్జునదాస్ చెప్పారు. జాపాలీ ఆంజనేయస్వామి ఆభరణాల్లో మాయమైన బంగారు డాలర్ నీవే తీసుకెళ్లావా అని ప్రశ్నిస్తుండగానే.. స్నానాల గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు యత్నించాడన్నారు. ఈ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చోరీపై విచారణ సాగుతున్న సమయంలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యకు యత్నించడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: శ్రీవారి సేవలో ప్రముఖులు