తెలుగు రాష్ట్రాల్లోని దళితవాడల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం, మత మార్పిడులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హిందూ ధార్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు సమకూర్చుకునే లక్ష్యంతో తితిదే 2019 మేలో శ్రీవాణి ట్రస్టును ప్రారంభించింది. తొలినాళ్లలో భక్తుల స్పందన అంతంతే కన్పించినా.. తర్వాత తితిదే ట్రస్ట్ బలోపేతానికి పలు సంస్కరణలు చేపట్టింది. ఇప్పటికే తితిదే అధ్వర్యంలో పలు ట్రస్టులు ఉన్నాయి. వీటికి రూ.లక్షకు పైబడి విరాళం ఇచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం, వసతి గది వంటి సౌకర్యాలు కల్పిస్తుంది. ఇవే నిబంధనలను శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేల విరాళం ఇచ్చి, రూ.500తో బ్రేక్ దర్శనం టిక్కెట్ తీసుకునే భక్తులకూ వర్తింపజేస్తోంది. వీరికోసం ఉదయం నిర్దేశిత సమయం కేటాయించింది. ఆలయంలో కులశేఖరపడి వరకూ అనుమతించడంతో పాటు శఠారి తీర్థ మర్యాదలను కల్పించింది. 2019 అక్టోబర్ 21 నుంచిమార్పులు చేపట్టి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. గత 18 నెలల కాలంలో కరోనా కారణంగా 3 నెలల పాటు ఆలయం తెరుచుకోలేదు. 2020 మార్చి నుంచి జూన్ వరకు ఆఫ్‌లైన్‌లో 93 రోజులు, ఆన్‌లైన్‌లో 84 రోజులు దర్శనాల బుకింగ్ నిలిపివేశారు. అయినప్పటికీ భక్తుల నుంచి రూ.11.43 కోట్ల విరాళాలు అందాయి. విరాళం అందజేసిన 90 రోజుల్లోగా దర్శనం చేసుకొనే వెసులుబాటును భక్తులువినియోగించుకున్నారు.
1400 మంది దళారులకు చెక్
శ్రీవాణి ట్రస్టు ఏర్పాటుకు ముందు.. కొందరు భక్తులు అడిగినంత మొత్తాన్ని దళారులకు సమర్పించుకొని బ్రేక్ దర్శనం టిక్కెట్లు పొందేవారు. నేడు.. అధికారికంగా వీఐపీ హోదా లేని ఎందరో సామాన్యులు రూ.10 వేలు ట్రస్టుకు చెల్లించి ప్రొటోకాల్ మర్యాదలతో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచీ దళారుల దందాను అడ్డుకునేందుకు సిఫార్సు లేఖలతో ఇచ్చే ఎల్-1, ఎల్-2, ఎల్-3 టిక్కెట్ల జారీపై తితిదే నిఘా పెట్టింది. వీఐపీల లేఖలను ఫోర్జరీ చేస్తున్న వారిని, పీఆర్వోల పేరుతో చలామణి అవుతూ టిక్కెట్లు అమ్ముకుంటున్న వారిని గుర్తించింది. మొత్తంగా ఏడాదిన్నరలో 172 కేసులు పెట్టి, 1400 మంది దళారులను కటకటాల్లోకి నెట్టింది. అదనపు ఈవో ధర్మారెడ్డి ‘ఈనాడు’తో మాట్లాడుతూ ‘ఉన్నత లక్ష్యంతో శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తున్నాం. భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. స్వామివారి ఖజానాకు నిధులు సమకూరుతున్నాయి. ఈ నిధులతో హైందవ ధర్మ ప్రచారానికి ఉపక్రమిస్తామ’ని వివరించారు.
ఇదీ చదవండి: