తిరుపతి అర్బన్ జిల్లాలో ఈ నెల 3న జరిగిన ఒక అత్యాచార ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి సీబీఐ మాజీ డైరక్టర్ ఎం.నాగేశ్వరరావు లేఖ రాశారు. ఒక పాస్టర్ తన వద్ద పని చేసే ఒక మహిళా ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారని... ఆ విషయంలో కేసు నమోదు చేయడానికి పోలీసులు 9 రోజులు ఆలస్యం చేశారని అందులో పేర్కొన్నారు. నిందితుడు స్థానికంగా మత మార్పిడుల వ్యాపారంలో పాలు పంచుకున్నాడని... రాజకీయ, ఇతర ఒత్తిడిలతో స్థానిక పోలీసులు నిందితుడిని అరెస్టు చేయలేదని ఆరోపించారు.
మహిళలపై నేరాల విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జారీ చేసిన నిబంధనల ప్రకారం.. స్థానిక పోలీసులు వెంటనే చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఆ విధంగా జరగడం లేదన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితుడిని అరెస్టు చేయాలని.. నిష్పాక్షితంగా వేగవంతమైన విచారణ చేపట్టాలని సీఎంను నాగేశ్వరరావు కోరారు. సీఆర్‌పీసీ సెక్షన్ 357 ప్రకారం భాదితురాలికి పరిహారం చెల్లించాలని కోరారు. ఈ మేరకు తాను ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆయన ట్విటర్ ద్వారా బయటపెట్టారు.
తిరుపతికి వచ్చి తెలుసుకోండి
మరోవైపు సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు చేసిన ఆరోపణలను తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఖండించారు. బాధితురాలి నుంచి ఈ నెల 12న ఫిర్యాదు అందిందన్న ఎస్పీ.... మూడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని అరెస్టు చేశామన్నారు. బాధితురాలికి పరిహారం ఇవ్వాలని నాగేశ్వరరావు చేసిన డిమాండ్‌ను స్వీకరిస్తూ తన నెల జీతం సగం ఇస్తున్నాన్న ఎస్పీ.... ఆయన ఎంత ఇస్తారో తెలియజేయాలన్నారు. ఎస్పీపై ఒత్తిడి ఉందో, లేదో తిరుపతికి వచ్చి నాగేశ్వరరావు తెలుకోవచ్చంటూ ఈ సందర్భంగా ఎస్పీ వ్యాఖ్యానించారు. ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తి ఐపీఎస్ అని ట్విటర్ ఖాతాలో ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించిన ఎస్పీ.... అసలు ఆ ఖాతా ఆయనదో కాదో విచారణ చేయిస్తామన్నారు.
అరెస్టు చేసి ఉంటే అప్పుడే చెప్పాల్సింది: తిరుపతి పోలీసులకు నాగేశ్వరరావు రిప్లై
పోలీసులు స్పందనపై సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ఘాటుగా ప్రతిస్పందించి...ట్వీట్ చేశారు. ఈ అంశంలో తాను ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని... చట్టాన్ని అమలు చేయమని కోరినట్లు తెలిపారు. ఒక వేళ ముందే అరెస్టు చేసి ఉంటే.. ఆ విషయం తన ట్వీట్‌కు రిప్లై ఇచ్చినప్పుడే చెప్పాల్సిందని అన్నారు. అలా కాకుండా మొక్కబడిగా బదులిచ్చారని.. ఆ రిప్లై ట్వీట్ కూడా ఇప్పుడు డిలీట్ చేశారని పేర్కొన్నారు. తర్వాతైనా నిందితుణ్ని అరెస్టు చేసినందుకు తిరుపతి పోలీసుల్ని ఆయన అభినందించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి